మద్దూరు(ధూళిమిట్ట), మే 18: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని వంగపల్లిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ సర్పంచ్ కొమిరె రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్, రైతులు మాట్లాడుతూ నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చినప్పటికీ ఇప్పటి వరకు కాంటా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
లారీలు లేకపోవడం వల్ల కొనుగోళ్లు ముందుకు సాగడం లేదన్నారు. ఒకవేళ కాంటా పెడితే మిల్లర్లు ధాన్యంలో తాలు ఉందని, గింజ చిన్నగా ఉందని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వెంటవెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల ఇబ్బందులు తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.