సదాశివపేట, సెప్టెంబర్ 8 : సాహిత్యం కవి గుం డెలోతుల్లోంచి పుట్టుకురావాలని, కవులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని ఎమ్మెల్సీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం అనంత సాహిత్య వేదిక వికారాబాద్ వారి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట మిత్ర బృందం సహకారంతో పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో కాళోజీ జయంతిని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాళోజీ తెలుగు యాస, సం స్కృతుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజలను చైతన్యపర్చారని కొనియాడారు. సాహిత్యం సమాజ చైతన్యం కోసం నిరంతరం కొనసాగే ప్రక్రియ అన్నారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో కవులు కవి త్వం రాయాలన్నారు.
సాహిత్యానికి కులం, మతం ఏదీ అడ్డురాదని, ఆ కోణంలో అసలు చూడకూడదన్నారు. దాదాపు 100 మంది యువ సాహితీ కళాకారులు కవితా పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, సాహితీవేత్త ఏనుగు నర్సింహారెడ్డి, అనంత సాహిత వేదిక గౌరవ అధ్యక్షుడు నర్సింహులుగుప్తా, సలహాదారు తుల్జారామ్సింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతాగోపాల్, బీఆర్ఎస్ నాయకుడు శివరాజ్‌పాటిల్, చింతా సాయినాథ్, కవులు తదితరులు పాల్గొన్నారు.