బెజ్జంకి, ఏప్రిల్ 4: తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని క్రాసింగ్ వద్ద ఎండిన పంటలను శుక్రవారం పరిశీలించనున్నారు. నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పెద్దఎత్తున బెజ్జంకి క్రాసింగ్‌కు తరలిరానున్నారు. మండలంలో చాలా ఎకరాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోయాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డా పొలాలు పూర్తిగా ఎండిపోయాయి.
పెట్టిన పెట్టుబడి రాక రైతులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మండుటెండల్లో సైతం గోదావరి జలాలను తెచ్చి చెరువులు, కుంటలను నింపి పంటలను కాపాడింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు ఎండుతున్నా కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్ట్టలేదు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి బెజ్జంకి మండలానికి సాగునీరు అందిస్తే రైతుల పంటలు దక్కేవి. కానీ, ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో పంటలు ఎండిపోయి రైతులు పుట్టెడు దు:ఖంలో ఉన్నారు. కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు వెళ్తూ బెజ్జంకి క్రాసింగ్ వద్ద ఎండిన పంటలను పరిశీలించి రైతులను
ఓదార్చనున్నారు.