సిద్దిపేట గడ్డ.. ఉద్యమాలకు పురిటిగడ్డ. ఇక్కడి నుంచే మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఒక్కడుగా బయలుదేరి కోట్లాది మంది ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి దశాబ్దాల కల సాకారం చేసిన గొప్ప ఉద్యమకారుడు కేసీఆర్. తనకు ఇష్టదైవమైన నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ ఉద్యమానికి బయలుదేరి రాష్ర్టాన్ని సాధించారు. సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపి దేశానికి ఆదర్శంగా నిలిపారు. పద్నాలుగేండ్ల ఉద్యమ ప్రస్తానం.. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు
అండదండగా నిలిచింది సిద్దిపేట గడ్డ. ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేసేందుకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల పార్టీశ్రేణులు, అభిమానులు సిద్ధమవుతున్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 22( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో తెలంగాణ ఉద్యమం చేతబట్టిన కేసీఆర్, శాంతియుత మార్గంలో పోరాటం చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన బతుకులు మారుతాయని భావించి, దీనికోసం మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 2001 ఏప్రిల్ 14న సిద్దిపేటలో జరిగిన అంబేద్కర్ జయంతి సభలో కేసీఆర్ పాల్గొని తెలంగాణ కోసం మరో పోరాటం తప్పదని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు బయలుదేరుతున్న తనవెంట మీరంతా నడవాలని కోరారు. కేసీఆర్ పిలుపునకు స్పందించి సిద్దిపేట గడ్డ ఆయన అడుగుజాడల్లో నడిచింది. అదేరోజు ఉద్యమ పార్టీ ఆవిర్భవాన్ని కేసీఆర్ వెల్లడించారు. 2001 ఏప్రిల్ 27న సిద్దిపేటలోని తన స్వగృహం నుంచి నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పార్టీ జెండా క్యాసెట్లను వెంకన్న స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం జై తెలంగాణ .. జైజై తెలంగాణ అంటూ ఉద్యమ జెండాను భుజానెత్తుకున్నారు. అక్కడి నుంచి కేసీఆర్ సుమారు వెయ్యి వాహనాల్లో భారీ కాన్వాయ్‌గా హైదరాబాద్‌కు బయలుదేరారు. నాడు సిద్దిపేట నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు,కార్యకర్తలతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది కేసీఆర్‌ను అనుసరించారు. రాజీవ్ రహదారి పొడవునా కేసీఆర్ కాన్వాయ్‌తో నిండిపోయింది.నేరుగా హైదరాబాద్ నందినగర్‌లోని తన ఇంటికి కేసీఆర్ వెళ్లారు. ఇంటి దాకా ప్రభుత్వ వాహనంలో ప్రయాణించిన కేసీఆర్, అక్కడి నుంచి సొంత వాహనంలో బయలుదేరి హుస్సేన్‌సాగర్ సమీపంలోని జలదృశ్యం సభావేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికే కేసీఆర్ ఏం చేస్తున్నారన్న ఉత్కంఠ ప్రజల్లో ఉండింది. సభలో తన మనసులో మాట బయటపెట్టారు.
తెలంగాణ కోసం తన పదవులకు రాజీనామా చేస్తూ మూడు లేఖలు చంద్రబాబుకు పంపించారు. డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ సభ్యత్వం, పార్టీ పదవులకు ఒకేసారి రాజీనామా చేసి ఆ సమయంలో ఒక రికార్డు నెలకొల్పారు కేసీఆర్. పదవులు కోసం కాదు.. ప్రజల కోసం పోరాటమంటూ తన లక్ష్యాన్ని ప్రకటించారు. పదవులు వదలుకోవడమనేది అప్పటి వరకు ఎవరూ ఊహించని చర్య. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమ పార్టీ స్థాపించారు.2001 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ద్వారా భారత రాష్ట్ర సమితి(తెలంగాణ రాష్ట్ర సమితి) అనే ఉద్యమ పార్టీని స్థాపించారు.ఆ రోజు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు తెలంగాణ యావత్తు సమాజం పులికించింది.
నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం తనకు సెంటిమెంట్‌గా కేసీఆర్ భావిస్తారు. 1985 నుంచి ఏ పని తలపెట్టినా ఇక్కడ పూజలు చేయడం కేసీఆర్‌కు ఆనవాయితీగా మారింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి సిద్దిపేటకు ఎన్నికయ్యారు. 1989, 1994, 1999, 2001, 2004, 2009, ఎన్నికల నామినేషన్ పత్రాలపై ఈ ఆలయంలో పూజలు నిర్వహించి, నామినేషన్ వేసి విజయం సాధించారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు 2001 ఏప్రిల్ 27న రాజీనామా చేసి, అదే రోజు ఉదయం కోనాయిపల్లి వెంకన్న ఆశీర్వాదం తీసుకొని బీఆర్ఎస్ (టీఆర్ఎస్)పార్టీని స్థాపించారు.
పార్టీ జెండాతో పాటు, సాహిత్యం, పాటల క్యాసెట్లను దేవుడి సన్నిధిలో పెట్టి పూజలు చేశారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో హైదరాబాద్‌లోని జలదృశ్యంలో పార్టీని ఏర్పాటు చేసి 14 ఏండ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించారు. 2004లో తెలంగాణ ప్రాంతంలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్(టీఆర్ఎస్)ఎమ్మెల్యే అభ్యర్థుల బీ-ఫారాలకు కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేయించి వారికి అందజేశారు. ఆ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్‌కు, సిద్దిపేట అసెంబ్లీకి పోటీచేసిన కేసీఆర్ రెండు చోట్ల ఘన విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీ స్థానానికి, హరీశ్‌రావు సిద్దిపేట ఎమ్మెల్యే స్థానానికి, కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే స్థానానికి ముగ్గురి నామినేషన్ పత్రాలకు పూజలు చేయించి నామినేషన్ వేయించారు.
ఈ ఎన్నికల్లో సైతం ఘన విజయం సాధించారు. 2014,2018 సాధారణ ఎన్నికల్లో సైతం ఇక్కడ కేసీఆర్ పూజలు చేసి విజయం సాధించారు. వరుసగా రెండుసార్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలిపారు. గత సాధారణ ఎన్నికల్లో కొద్ది సీట్లతో బీఆర్ఎస్కు అధికారం దూరమైంది. గజ్వేల్ స్థానం నుంచి భారీ మెజార్టీతో కేసీఆర్ విజయం సాధించారు.