సిద్దిపేట, జూలై 16: నిబద్ధతకు మారుపేరు కేసీఆర్ అని బీఆర్ఎస్వీ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువై ఉన్న కేసీఆర్ ప్రతిరూపాన్ని కుట్రలు, అక్రమ కేసులతో తుడిచివేయలేరని, సుప్రీంకోర్టు తీర్పు దానికి నిలువెత్తు నిదర్శనమని సిద్దిపేట పట్టణ సోషల్మీడియా కన్వీనర్ కర్రోళ్ల సతీశ్, బీఆర్ఎస్వీ పట్టణ అధికారప్రతినిధి మెరుగు మాధవ్, ప్రధానకార్యదర్శి వంశీ అన్నారు. మంగళవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ విద్యుత్ ఒప్పంద విచారణ కమిషన్ చైర్మన్ నర్సింహారెడ్డిని తొలిగించాలని వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపదెబ్బ అన్నారు. తెలంగాణ వచ్చినప్పుటి నుంచి సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి కేసీఆర్ అని, వ్యక్తిగతంగా కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పదేండ్లలో తెలంగాణను దేశంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టారని, దానిని తుడిచివేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. కేసీఆర్ ముందుచూపుతోనే నేడు తెలంగాణలో విద్యుత్ కోతలు లేవన్నారు. న్యాయం తమ వైపు ఉన్నందున ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నామని, బీఆర్ఎస్ కార్యకర్తల సహనానికి పరీక్ష పెట్టొద్దన్నారు.