పటాన్చెరు రూరల్, ఏప్రిల్ 16: ఉద్యోగాల కోసం కాకుండా ఉపాధి కర్తలుగా ఎదగాలని గీతం డీమ్డ్ యూనివర్సిటీ, కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) తృతీయ పట్టభద్రుల దినోత్సవంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి పట్టభద్రుల వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన కౌటిల్యా విద్యార్థులంతా ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలన్నారు.
జాతీయంగా, ప్రపంచ వ్యాప్తంగా ప్రజా విధాన రూపకల్పనలో వారు పోషించే కీలక పాత్రను ఆయన వివరించారు. గీతం అధ్యక్షుడు శ్రీభరత్ మాట్లాడుతూ పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ అందుకుంటున్న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా 30మందికి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. డిగ్రీ ప్రదానోత్సవాన్ని కేఎస్ పీపీ డీన్, ఐక్యరాజ్యసమితిలో భారత పూర్వ శాశ్వత ప్రతినిధి ప్రొఫెసర్ సయ్యద్ అక్బరుద్దీన్ నిర్వహించారు. కార్యక్రమంలో గీతం రిజిస్ట్రార్ డాక్టర్ గుణశేఖరన్, గీతం ఉపకులపతి ప్రొఫెసర్ ఎర్రోల్ డిసౌజా, గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.