మద్దూరు(ధూళిమిట్ట), అక్టోబర్ 26 : పరమ శివుడికి ప్రీతి పాత్రమైన కార్తికమాసం మహిళలకు కూడా ఎంతో పవిత్రం. వేకువ జామున స్నానాలు, తులసి పూజలు, నోములు, ఉపవాసాలు భక్తి భావాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పూజా నియమాలు, వ్రతాల్లో ఆరోగ్య సూత్రాలు మిళితమై ఉన్నాయి. శివాలయాలన్నీ ఈ మాసంలో దీపాల అలంకరణలో కొత్తకాంతులు సంతరించుకుంటాయి. ఈ మాసంలో ప్రతిరోజూ పుణ్య ప్రదమైందే. కార్తికమాసం ప్రారంభమైన సందర్భంగా ప్రత్యేక కథనం.
చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృతికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించడంతో ఈ మాసానికి కార్తికమాసం అనే పేరు వచ్చింది. ఈ మాసం తెలుగు సంవత్సరాల్లో ఎనిమిదో నెల. పౌర్ణమి రోజు కృతిక నక్షత్రం (చంద్రుడు కృతిక కలిసిన రోజు) కావున ఈ నెలను కార్తికమాసంగా గుర్తించారు.
ప్రత్యేక పర్వదినాలు
ఈనెల 31న కార్తికమాసం మొదటి సోమవారం, నవంబర్ 4న కార్తీక శుద్ధ ఏకాదశి, 7న రెండో కార్తిక సోమవారం, 8న కార్తిక పౌర్ణమి, 13న ఆరుద్రనక్షత్రం, 14న మూడో కార్తిక సోమవారం, 20న కార్తిక బహుళ ఏకాదశి, 21న నాలుగో కార్తిక సోమవారం, 22న మాస శివరాత్రి, 23 వరకు కార్తిక మాస ప్రత్యేక పూజలు కొనసాగుతాయి.
కార్తిక దీపం..
ఇంటి ఎదుట ద్వారానికిరువైపులా దీపాలను వెలిగిస్తే సాక్షాత్తూ లక్ష్మీదేవి తమ ఇంటికి నడిచి వస్తుందని భక్తుల నమ్మకం. ఈ నెలంతా ఆలయాల్లో కార్తిక దీపం వెలిగిస్తుంటారు. ఆవు, నువ్వుల నూనె, ఆవిసె నూనెలతో దీపాలు వెలిగించవచ్చు. అరటి డొప్పెలు, ఆకులపైన దీపాలు ఉంచి నదుల్లో వదులుతారు.
నదీస్నానం.. ప్రకృతి వైద్యం..
కార్తికమాసంలో నదీ స్నానం చేయడం చాలా ఉత్తమమైనది. రుతుపవనాల్లో వచ్చే మార్పులతో ప్రకృతిలో కూడా అనేక మార్పులు వస్తాయి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేస్తారు. సూర్య భగవానుడు అనంత కిరణాలతో సౌరశక్తిని నదీ జలాలపై ప్రజ్వలింపజేస్తాడు. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన వారి శరీరానికి సౌరశక్తి లభిస్తుంది. అందుకే నీరు వెచ్చగా ఉంటుంది. ఆరోగ్యం ఉత్సాహంగా ఉండడంతో పాటు శక్తి పెరుగుతుంది.
నియమనిష్ఠలతోనే పుణ్యఫలం..
ఈ మాసంలో చేసే స్నానం, దాన, జపాలతో అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అలా రోజూ చేయలేని
వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలు లేక కనీసం ఒక పూర్ణిమ, ఒక సోమవారమైనా నియమనిష్ఠలతో ఉపవాసం ఉండాలి. అంతే కాకుండా గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం ఎవరి తరం కాదని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే చెప్పినట్లు కార్తిక పురాణం చెబుతున్నది. పారే నదిలో స్నానమాచరిస్తే పుణ్యం దక్కుతుందని భావించే భక్తులు ఈ మాసంలో తీర్థయాత్రలకు అధిక ప్రాధాన్యమిస్తుంటారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానంతో మానవుల్లోని క్రోద, మద, మాత్సర్యాలు కొట్టుకుపోతాయనేది విశ్వాసం. ఈ మాసంలో ఏ ఆలయంలో చూసినా నోములు, వ్రతాలే దర్శనమిస్తాయి.
సత్యనారాయణ వత్రం
మాఘేవా, మాదవేమాసిం, కార్తికేవా శుభేదినే.. అని సత్యనా రాయణ వ్రత కథలో మొదటి అధ్యాయంలో చెప్తారు. అంటే మాఘ మాసంలో గానీ, చైత్ర మాసంలో గానీ, కార్తిక మాసంలో గానీ ఒక శుభదినాన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలని అర్థం. సత్యనారాయణ వ్రతం ప్రత్యేకించి ఈ మాసంలో పౌర్ణమి రోజు ఆచరించడం మంచిదని వేద పండితులు చెబుతున్నారు
గోవును పూజించడం
అన్ని దేవతలకి ప్రతీక అయిన గోవును వత్స సహితంగా (దూడతో కలిపి) పూజిస్తారు. శక్తి లేనివారు తమ శక్తి కొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడంతో వంశవృద్ధి జరుగుతుందని ప్రతీతి. ఈ నెలలో ఉసిరికాయలను కూడా దీప సహితంగా దానం చేస్తారు. మరికొందరు ఉసిరికాయ మీద వత్తిపెట్టి వెలిగించి దానం చేస్తారు
దీప లక్షణాలు
కార్తిక దీపంలో రెండు వత్తులు కలిపి రెండుగా వేయడం లేక మూడు వత్తులు కలిపి ఒకటిగా వేస్తారు. దీని కోసం పత్తి, తామర నార, అరటి నార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తిక మాసంలో ఒకసారి దీపదానం చేసిన వారికి ఏడాదంతా మంచే జరుగుతుంది.
నియమ నిష్టలతో పూజిస్తే మహా పుణ్యం
కార్తిక మాసంలోని ప్రతి రోజూ అత్యంత శ్రేష్టమైనది. కార్తిక మాసం శివకేశవులకు చాలా ప్రీతపాత్రమైనది. తెల్లవారుజామునే ఆలయాలను దర్శించుకొని పూజలు చేయాలి. ఈ మాసంలో శివకేశవులను పూజిస్తే మహాపుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానాన్ని పారద్రోలే జ్ఞాన జ్యోతులు కావాలి.
– పానుగంటి తిరుపతయ్య, అర్చకుడు, మద్దూరు