జహీరాబాద్, జూన్ 30: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో మంగళవారం మళ్లీ కర్ణాటక చెత్త దుమారం చెలరేగింది. తమ గ్రామ శివారుగుండా చెత్తవాహనాలు వెళ్లకుండా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామస్తులు అడ్డుకున్నారు. కొన్ని నెలలుగా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్ట్టణానికి చెందిన చెత్తసేకరణ వాహనాలను మల్గి గ్రామ శివారు గుండా డంపింగ్ యార్డు కు తరలిస్తున్నారు. డంపింగ్ యార్డులో పారబోసిన చెత్తాచెదారాన్ని రాత్రి కాల్చివేయడంతో పొగ, దుర్గంధంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనార్యోగానికి గురవుతుండడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. కొన్ని రోజులుగా గ్రామ శివారులో గ్రామస్తులు రాత్రి, పగలు కాపుకాసి చెత్తవాహనాలను వెనక్కి పంపించారు. దీంతో కొన్ని రోజులుగా బీదర్ పట్టణంలో సేకరించే చెత్తాచెదారాన్ని ఇతర ప్రాంతానికి తరలించారు. మంగళవారం మళ్లీ చెత్తవాహనాలను మల్గి గ్రామ శివారు గుండా డంపింగ్‌యార్డుకు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీదర్ పట్టణ ప్రజాప్రతినిధులు, అధికారుల అక్కడికి వచ్చి మల్గి గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగారు. దీంతో గ్రామస్తులు సైతం ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.

బీదర్ ప్రాంతం గుండా డంపింగ్ యార్డుకు వాహనాలను తీసుకువెళ్లేందుకు అవకాశం ఉన్నప్పటికీ తమ గ్రామ శివారు గుండా తీసుకువెళ్లడం ఏమిటని సంబంధిత అధికారులను వారు నిలదీశారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న చెత్తవాహనాలను గ్రామ శివారు గుండా తరలిస్తే సహించిలేదని హెచ్చరించారు. దీంతో బీదర్ మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామస్తులపై బెదిరింపులకు దిగారు. బీదర్ పట్టణానికి ఎలా వస్తారో చూస్తాం అంటూ వాహనాల్లో ఉన్న చెత్తను మల్గి గ్రామ శివారు గుండా రాకపోకలు సాగించే దారిపై అడ్డంగా వేసిపోయారు. ఈ విషయాన్ని వెంటనే మల్గి గ్రామస్తులు న్యాల్కల్ మండల రెవెన్యూ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ఐ శ్యామ్‌రావు, హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. దారికి అడ్డంగా వేసి చెత్తాచెదారాన్ని జేసేబీతో తొలిగించి రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.