చేగుంట, మార్చి 13: సాగు నీరందించి పంటలు కాపాడాలని మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్‌పల్లిలో రైతులు గురువారం చెరువు వద్ద ఆందోళన చేపట్టారు. మల్లన్నసాగర్ కాలువ ద్వారా చెరువుకు నీరు చేరకుండా గొడుగుపల్లి, గొల్లపల్లి గ్రామాల రైతులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్ల నుంచి నీరురాక పంటలు ఎండిపోతున్నాయని, ఏడెనిమిది వందల ఫీట్ల వరకు బోర్లు వేయించినా నీరురావడం లేదన్నారు.
గ్రామంలో సుమారు 50మందికి పైగా రైతులు బోర్లు వేసి అప్పుల పాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పేది లేక పొట్ట దశలో ఉన్న వరి పంటలను రక్షించుకునేందకు సుమారు వెయ్యి రూపాయలు పెట్టి ట్యాంకర్ ద్వారా నీళ్లు అందిస్తున్నట్లు కర్నాల్‌పల్లి రైతులు తెలిపారు. ఇంత చేస్తున్నా పంటలు గట్టెక్కుతాయనే నమ్మకం లేదన్నారు. ఎండిపోయిన వరి పొలాలు పశువులకు, గొర్రెలకు మోతగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో కాలువల ద్వారా వచ్చిన నీటితో చెరువు నిండిందని, ఈసారి ఆ పరిస్థితి లేదని రైతులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు నీళ్లందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఆందోళనలో కర్నాల్‌పల్లి రైతులు కానుగంటి లచ్చయ్య, చింతాకుల శ్రీశైలం, వంటరి శ్రీనివాస్‌రెడ్డి, మాణిక్యం, శేకులు, గుడ్డం మల్లయ్య, శ్రీనివాస్, రవి, కె.రమేశ్, రాజు,రాకేశ్, నవీన్‌రెడ్డి, ఎల్లారెడ్డి, గ్యాదరి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై కెనాల్ డీఈ శ్రీనివాస్‌రెడ్డిని నమస్తే తెలంగాణ ఫోన్ ద్వారా వివరణ కోరగా.. ఆయన స్పందించలేదు.