మెదక్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం 25 రోజుల పాటు కొనసాగుతూ లక్షా 44వేల 510 మందికి కంటి పరీక్షలు చేసింది. ఇందులో పురుషులు 68,962 మంది, మహిళలు 75,548 మంది ఉన్నారు. ఇప్పటివరకు 17,023 మందికి కండ్లద్దాలు అందజేశారు. దూరపు చూపు ఉన్న 15 వేల మందికి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. గురువారం 25వ రోజు మెదక్ జిల్లా వ్యాప్తంగా 40 బృందాలతో శిబిరాలు నిర్వహించి, 6345 మందికి కంటి పరీక్షలు చేశారు. 514 మందికి కండ్లద్దాలు అందజేశారు. మరో 602 మందికి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. మెదక్ జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంటి పరీక్షలు చేస్తున్నారని డీఎంహెచ్‌వో చందునాయక్ తెలిపారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి, ఫిబ్రవరి 23: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలో 66 కంటి వెలుగు శిబిరాల్లో 17,274 మందికి కంటి పరీక్షలు చేశారు. 1198 మందికి కండ్లద్దాలు అందజేశారు. 1077 మందికి అద్దాల కోసం రెఫర్ చేశారు. ఆపరేషన్లు అవసరమున్న 1563 మందికి ఇతర దవాఖానలకు పంపించారు.
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 23: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో రాష్ట్రంలోకెల్లా సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని 26వ వార్డు ఏకలవ్య సంఘం భవనంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని రకాల అసోసియేషన్లు, యూనియన్లు, జర్నలిస్టులు, అడ్వకేట్లకు వారి ప్రదేశాల్లో కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. త్వరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వో కాశీనాథ్‌ను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,68,062 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో 36,759 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశామని.. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ 27,879 మందికి పంపిణీ చేసినట్లు తెలిపారు. కష్టపడి పనిచేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో చివరి వ్యక్తి వరకు ఉత్సాహంగా పని చేయాలని మంత్రి కోరారు.
కంటి పరీక్షలు చేయించుకున్న మంత్రి
పట్టణంలోని ఏకలవ్య భవనంలో మంత్రి హరీశ్‌రావు కంటి పరీక్షలు చేయించుకున్నారు. తాను కంటి అద్దాలు పొంది, పలువురు వార్డు ప్రజలకు కంటి అద్దాలను అందజేశారు. కొందరు వృద్ధులతో మాట్లాడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారి కాశీనాథ్, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు.