వెల్దుర్తి, జనవరి 31: ఇచ్చిన హామీ మేరకు ఆడపిల్లల పెండ్లికి లక్ష రూపాయల సాయంతో పాటు తులం బంగారం ఇచ్చే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో 38 మందికి కల్యాణలక్ష్మి, 4 షాదీముబారక్ చెక్కులను ఆమె అందజేశారు. అనంతరం మండలంలోని పంతులపల్లిలో రూ. 40 లక్షలతో వేసిన సీసీ రోడ్డు, బస్వాపూర్‌లో రూ. 7లక్షలతో నిర్మించిన ముదిరాజ్ భవనం, రూ. 12.60 లక్షలతో నిర్మించిన శ్మశాన వాటికను ప్రారంభించారు. ఆరెగూడెంలో రూ. 15 లక్షలతో కురుమ సంఘం భవవ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారు అన్నివర్గాల అభివృద్ధికి కృషిచేసిందన్నారు.
ఆడపిల్లల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని, ఆడ పిల్లల కుటుంబాలను ఆదుకోవాలనే మంచి లక్ష్యంతో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను కేసీఆర్ అమలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, త్వరగా అమలు చేయాలన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, వైస్ ఎంపీపీ సుధాకర్‌గౌడ్, సర్పంచ్‌లు భాగ్యమ్మ, శేఖర్, మల్లేశంగౌడ్, ఎంపీటీసీలు మోహన్‌రెడ్డి, లక్ష్మీ, పీఏసీఎస్ చైర్మన్ అనంతరెడ్డి, ఆత్మకమిటీ చైర్మెన్ ప్రతాప్‌రెడ్డి, తహసీల్దార్ తులసీరాం, ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, ఆర్ఐ జయభరత్‌రెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు, లబ్ధ్దిదారులు పాల్గొన్నారు.