నర్సాపూర్, ఫిబ్రవరి16: మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్లో కలపాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో జీరో అవర్‌లో ఎమ్మెల్యే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్లో కలపడం మూలంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని, ప్రమోషన్స్ ఉండవని, ఉద్యోగులు అభద్రతా భావంలో ఉన్నారని వెల్లడించారు. మెదక్ జిల్లా హైదరాబాద్‌కి దగ్గరలో ఉందని ఆరోగ్యపరంగా, విద్యాపరంగా ఇక్కడికే వస్తారని అన్నారు. ఎన్నికల సమయంలో సైతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చార్మినార్ జోన్లో కలుపుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రజాపాలనలో కూడా మెదక్‌కు చెందిన ఉద్యోగులు, యువకులు అభ్యర్థనలు పంపించారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులు, ఉద్యోగులకు మేలు జరిగేలా మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్‌కి మార్చాలని కోరారు.
అలాగే, హల్దీ వాగుపైన నర్సాపూర్, గజ్వేల్ నియోజవర్గాల్లో అనేక చెక్‌డ్యామ్‌లు ఉన్నప్పటికీ నీళ్లు తగ్గిపోవడంతో ఈ ప్రాంతంలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పండిందన్నారు. మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌లో నీళ్లు నింపారని, అక్కడి నుంచి తక్షణమే 0.3 టీఎంసీ నీటిని హల్దీ వాగులోకి వదిలితే 20 నుంచి 30 చెక్‌డ్యామ్‌లు నిండుతాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులను దృష్టిలో పెట్టుకొని నీళ్లు వదలిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు కూడా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.