సంగారెడ్డి మే 20(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. వారాల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం, అధికారుల తీరుపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేశామని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు లారీలకు రావడంలేదు. ఫలితంగా కాంటా పెట్టి రైతుల ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. లారీలు, గన్నీబ్యాగులు, లేబర్ కొరత వేధిస్తున్నా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై ఇటీవల చౌటకూరు, కంది కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ధర్నా, రాస్తారోకోలు చేపట్టారు. రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ జిల్లాలో ధాన్యం సేకరణ వేగంగా సాగడంలేదు.
సంగారెడ్డి జిల్లాలో యాసంగిలో రైతులు పండించిన 2.20 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 233 కొనుగోలు కేంద్రా లు ప్రారంభించారు. 2.20 లక్షల టన్నులకు ఇప్పటి వరకు అధికార యంత్రాంగం 59,120 టన్నుల ధాన్యం సేకరించింది. కేవలం 26 శాతం ధాన్యం సేకరణ మాత్రమే జరిగింది. దొడ్డురకం వడ్లు 56,617 టన్నులు, సన్నరకం వడ్లు 3120 టన్నులు సేకరించారు. సేకరించిన ధాన్యంలో 39,113 టన్నులకు ట్రక్‌షీట్ జనరేట్ అయ్యింది. సేకరించిన ధాన్యంలో మిల్లులకు 36317 టన్నులు మాత్రమే చేరాయి. అధికారుల అంచనా ప్రకారం ఇప్పటి వరకు 70 శాతానికి పైగా ధాన్యం సేకరణ పూర్తి కావాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాలకు మూడు రోజులకు ఒకటి నుంచి రెండు లారీలు మాత్రమే వస్తున్నాయి. దీంతో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన కొనసాగుతున్నాయి. సంగారెడ్డికి పక్కనే ఉన్న కులబ్గూరు కొనుగోలు కేంద్రానికి వారం రోజులుగా లారీలు పంపలేదు.
కంది, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, శివ్వంపేట, పుల్కల్ తదితర ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలకు లారీలు రాలేదు.జాతీయ రహదారికి ఇరువైపులా రైతులు ధాన్యం కుప్పలు, బస్తాలు వేసి లారీల కోసం ఎదురు చూస్తున్నారు. 2.20 లక్షల ధాన్యం సేకరణకు 5.50లక్షల గన్నీబ్యాగులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కాగా ఇప్పటి వరకు 3.06 లక్షల గన్నీబ్యాగులు వచ్చాయి. ఇంకా 2.50 లక్షల గన్నీబ్యాగులు రావాల్సి ఉంది. గన్నీబ్యాగుల లేక ధాన్యం కాటా వేయడం, మిల్లులకు తరలించడం ఆలస్యమవుతుంది. గన్నీబ్యాగులు లేక రెండు రోజుల క్రితం కంది గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నా చేశారు. గన్నీబ్యాగులు, లారీలు, లేబర్ కొరతతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగడంలేదు.దీంతో రైతులు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లారీ కొరత తీవ్రంగా ఉండటంతో రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. రెండు మూడు రోజులుగా జిల్లాలోని రెండు జాతీయ రహదారులపై మకాం వేసి జిల్లాలోకి ప్రవేశించిన ఖాళీ లారీలు, డీసీఎంలను నిలిపివేస్తున్నారు. ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి లారీలు, డీసీఎంలు జిల్లాలోని కంపెనీల నుంచి ఉత్పత్తులను తమ ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు వస్తున్నాయి. ఇలాంటి వాహనాలను రవాణాశాఖ అధికారులు రోడ్లపైనే నిలిపివేసి బలవంతంగా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. బలవంతంగా తరలించిన లారీ, డీసీఎంలు కేవలం తమకు కేటాయించిన కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి ఒక లోడ్ మాత్రమే తీసుకువెళ్తున్నాయి. అయితే మిల్లుల వద్ద అన్లోడింగ్ కావడంలేదు. మిల్లర్లు లేబర్ కొరత పేరుతో అన్లోడింగ్ చేయడంలేదు.
ఏగ్రేడ్ రకం వడ్లకు ప్రభుత్వం రూ.2389 మద్దతు ధర ప్రకటించింది. మిల్లర్లు రూ. 1800 చెల్లించి రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లు వస్తే లేబర్ కొరత చూపి అన్లోడ్ చేయడం లేదు. గోదాములు నిండిపోయాయి.. ఇక ధాన్యం కొనుగోలు చేయలేమని చెబుతున్నారు.
మెదక్, మే 20 (నమస్తే తెలంగాణ): వరి ధాన్యం పండించిన రైతులకు కన్నీరు తప్ప ఏమీ లేదు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించినా తూ కం వేయడం లేదు. గన్నీ బ్యాగుల కొర త చాలా ఉం ది. లారీలు రాక తూకం వేసిన బస్తాల వద్ద రెండు, మూడు రోజుల నుంచి కాపలా ఉంటున్నాం. మూడు రోజులకు ఒక లారీ వచ్చినా అందరి ధాన్యం తరలించడం లేదు. రైతులు ధాన్యం బస్తాల వద్ద కాపాలా ఉండే పరిస్థితి వచ్చింది. అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదు.
– స్వరూప, మహిళా రైతు, కొల్చారం (మెదక్ జిల్లా)
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే దిక్కులేకుండా పోయింది. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. సంగారెడ్డికి చెందిన తాను కులబ్గూరు ధాన్యం కొనుగోలు కేంద్రానికి రెండు వారాల క్రితం వంద క్వింటాళ్ల వడ్లు తీసుకొచ్చా. వడ్లు తీసుకొచ్చి రెండు వారాలు దాటినా ఇప్పటి వరకు కాంటా వేసిన పాపాన పోలేదు. కొనుగోలు కేంద్రానికి ఇంత వరకు లారీలు రావడం లేదు. లారీలు లేక ధాన్యం కొనుగోలు ఎలా చేస్తామని అధికారులు చెబుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి లారీలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలి.
– మల్లేశం, రైతు, కులబ్గూరు, సంగారెడ్డి జిల్లా
మద్దూరు(ధూళిమిట్ట), మే 20: వడ్లు అమ్ముకునేందుకు గింతతిప్పలు ఎప్పుడూ పడలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వడ్లు సరిగ్గా కొంటలేరు. కాంటా సక్రమంగా అయితలేదు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అనేది ఏదీలేదు. గత సంవత్సరం సన్నవడ్లకు బోనస్ ఇస్తమని చెప్పిండ్రు. ఆ డబ్బులు ఇంతవరకు రాలేదు. ఇప్పుడు కూడా ఏ -గ్రేడ్ ధాన్యాన్ని తీసుకుపోయి బీ- గ్రేడ్‌గా వేసి రైతులకు నష్టం చేస్తుండ్రు. తాలు, గింజ చిన్నగా ఉన్నదని చాలా సతాయిస్తుండ్రు. లారీలు సక్కగా వస్తలేవు. సెంటర్లో సీరియల్ సిస్టమనేది ఏదీ లేదు. తెలిసిన వాళ్లకు ముందుగా కాంటా పెట్టి లోడింగ్ చేస్తుండ్రు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత ఇబ్బంది ఎప్పుడూ లేదు. రెండేండ్ల నుంచి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి రైతులు సమస్యలు పరిష్కరించాలి.
– కంఠారెడ్డి మధుసూదన్‌రెడ్డి, రైతు, మద్దూరు (సిద్దిపేట జిల్లా)
మెదక్, మే 20 (నమస్తే తెలంగాణ) : తూకం వేసిన ధాన్యం తరలించేందుకు లారీలు రావడ లేదు. రాత్రి,పగలు అనే తేడా లేకుండా బస్తాల వద్ద కాపాలా ఉంటున్నాం. గన్నీ బ్యాగులు లేక రెండు రోజుల నుంచి తూకం వేయడం లేదు. లారీలు రాక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీ నిర్వాహకులు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. వర్షం వస్తే ధాన్యం తడిసిపోతుంది. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వరి సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు.
– మంగలి భూమమ్మ, మహిళా రైతు, కొల్చారం (మెదక్ జిల్లా)
లారీల కొరతతో శివ్వంపేటలో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు. 20 రోజులుగా రహదారిపై ధాన్యం కుప్పగా పోశా. వర్షం కురుస్తుందన్న భయంతో రూ.4 వేలు ఖర్చు చేసి బస్తాల్లో ధాన్యం నింపా. ధాన్యం పూర్తిగా బస్తాల్లో నింపినప్పటికీ అధికారులు కాంటా వేసి బస్తాలు తరలించడం లేదు. వారం రోజులుగా శివ్వంపేట కొనుగోలు కేంద్రానికి లారీలు రావడం లేదు. అధికారులు రైతుల బాధలు అర్థంచేసుకుని వెంటనే లారీలు ఏర్పాటు చేయాలి.
– శంకర్, రైతు, శివ్వంపేట, మెదక్ జిల్లా
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిత్యం అరిగోస పడుతున్నాం. ఉదయం ఎండ, రాత్రి ఉరుములు, మెరుపులతో తూకం వేసిన బస్తాల వద్ద జాగరణ చేయాల్సి పరిస్థితి వచ్చింది. గ్రామంలో ఇప్పటి వరకు కేవలం ఒకలారీ ధాన్యం మాత్రమే తరలించారు. ఇప్పటి వరకు 2వేల బస్తాల ధాన్యం తూకం వేసి సిద్ధంగా ఉంది. లారీల కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు.తూకం వేసిన ధాన్యాన్ని తొందరగా మిల్లుకు తరలించాలి. అధికారులు ఇప్పటికైనా స్పందించి తూకం వేసిన బస్తాలతో పాటు తూకం వేయడానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి.
– యాదగిరి, రైతు, తిమ్మక్కపల్లి, రాయపోల్ మండలం (సిద్దిపేట జిల్లా)