సిద్దిపేట, ఆగస్టు16: నిందితులను కఠినంగా శిక్షించాలని శుక్రవారం మెడికల్ విద్యార్థు లు, జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై లైంగికదాడికి పాల్పడి హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన నుంచి ముస్తాబాద్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ వరకు నిరసన సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ర్యాలీ చేపట్టారు.
నల్ల బ్యాడ్జీలు ధరించి పాత బస్టాండ్ రోడ్డుపై బైఠాయించా రు. వైద్య విద్యార్థినిపై జరిగిన పాశవిక ఘటనను ప్రదర్శన ద్వారా కళ్లకు కట్టినట్లుగా వివరించారు. మహిళలపై ఆఘాయిత్యానికి పాల్పడితే ఎలా స్పదించాలనే అంశంపై వివరిస్తూ నృత్యాల ద్వారా ప్రదర్శన చేశారు. రాఖీ పండుగ సందర్భంగా ఆక్కాచెల్లెండ్లు రాఖీ కడితే ఇచ్చే బహుమతిగా వైద్య విద్యార్థినీలకు పెప్పర్ స్ప్రే బాటిళ్లు అందజేశారు. నిరసనలో సురభి మెడికల్ కాలేజీ వైద్యా విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.