పటాన్చెరు, జూలై 4: సిగాచి పరిశ్రమ ప్రమాదంపై న్యాయ విచారణ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. పటాన్చెరు ధ్రువ దవాఖానలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించి, బాధిత కుటుంబాలతో మాట్లాడారు.
సిగాచి పరిశ్రమలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం బాధాకరం అని, అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆయన వెంట సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ రాష్ట్ర నాయకుడు ప్రకాశ్‌రావు, జిల్లా కార్యదర్శి సయ్యదు జలాలుద్దీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద పవన్, నాయకులు ఆనంద్, దత్తురెడ్డి, రెహమాన్, అశోక్, మహబూబ్, మోహిన్ తదితరులు ఉన్నారు.