అందోల్, అక్టోబర్ 27: జోగిపేట పట్టణాన్ని అన్నిరంగాలో అభివృద్ధి చేసి పూర్వవైభవం తెస్తానని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం జోగిపేటలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాలకవర్గంతో ప్రమాణస్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందోల్ నియోజకవర్గాన్ని అంచలంచెలుగా అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. జోగిపేటను వ్యాపార పరంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రూ. 78 కోట్లతో మంజీరా నదిపై వంతెన నిర్మించి అజ్జమర్రి నుంచి జోగిపేటకు విశాలంగా రోడ్డు మార్గం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మార్కెట్ యార్డులో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొత్త పాలకవర్గం కృషిచేయాలన్నారు. మార్కెట్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 5 కోట్లతో ప్రతిపాదనాలు రూపొందించామని, త్వరలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, వీటిని ఇండ్లులేని అర్హులైన పేదలకు అందజేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని హైవేలపై 75 ఎమర్జెన్సీ ట్రా మాకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రూ. 40 కోట్లతో అందోల్‌లో నర్సింగ్ కళాశాల, 100 పడకలతో అత్యవసర సమయంలో వైద్యం అందించేలా మల్టీ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నామని చెప్పారు. అనంతరం మంత్రిని పలువురు ఘనంగా సన్మానించారు. తిరు గు ప్రయాణంలో ప్రభుత్వ దవాఖానను మంత్రి ఆకస్మికంగా తనిఖీచేసి, అజ్జమర్రి-జోగిపేట రోడ్డు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్‌షెట్కార్, ఆర్డీవో పాండు, ఏఎంసీ చైర్మన్ మక్త జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ తిరుపతి, ఏఎంసీ కార్యదర్శి సునీల్‌కుమార్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివరాజ్, శేషారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పద్మనాభరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, కౌన్సిలర్లు సురేందర్‌గౌడ్, దుర్గేశ్, చందర్‌నాయక్, నాయకులు మర్వెల్లి సంగమేశ్వర్, దుద్దా ల శ్రీశైలం, వీర్మల్లప్ప, రాజిరెడ్డి, ప్రదీప్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.