చేర్యాల, మే 7 : బీఆర్ఎస్ పాలనలో సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. పనులు సైతం నాటి ఏఎంసీ పాలకవర్గం పర్యవేక్షణలో కొనసాగాయి. పనులు పూర్తయి రెండేండ్లు గడుస్తున్నా స్థానికంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రారంభం పెండింగ్‌లో పడింది. ఎట్టకేలకు మార్కెటింగ్ శాఖ అధికారులు గురువారం షాపింగ్ కాంప్లెక్స్‌ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా ఏఎంసీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేతతో కలిసి ప్రారంభింపజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులు చేయడమే కాదు సకాలంలో వాటిని ప్రారంభించి ప్రజలకు వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉంటుందనే విషయాన్ని గమనించాలన్నారు. రాజకీయాల కోసం అభివృద్ధి పనులను అడ్డుకునే సంస్కృతిని పక్కన పెట్టాలని హితవు పలికారు. షాపింగ్ కాంప్లెక్స్‌తో స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు మరింత వసతి కలుగుతుందన్నారు. అధిక ధరలకు రైతులు విక్రయించుకునేందుకు, వ్యాపారులకు సైతం సౌకర్యంగా ఉంటుందన్నారు.
ప్రొటోకాల్‌కు భిన్నంగా వ్యవహరించిన కాంగ్రెస్ నాయకులు
చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాకముందే ప్రారంభించేందుకు కాంగ్రెస్ నాయకులు కొందరు యత్నించారు. సాయంత్రం నాలుగు గంటలకు సమయం ఇచ్చారని, తామే అదే సమయానికి ప్రారంభింపజేస్తామంటూ శిలఫలకం వద్దకు వెళ్లారు. దీనిని గమనించిన జిల్లా మార్కెటింగ్ అధికారితో పాటు స్థ్ధానిక మార్కెట్ అధికారులు, సీఐ రమేశ్‌నాయక్, ఎస్సై అపూర్వరెడ్డి ఎమ్మెల్యే రాకముందు ప్రారంభించడం సరికాదని ప్రొటోకాల్‌కు విరుద్ధంగా వెళ్లడం సరికాదని నాయకులకు సర్థిచెప్పేందుకు యత్నించారు.
అయినప్పటికి తామే ప్రారంభిస్తామని పలువురు యత్నిస్తున్న సమయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభోత్సవ ప్రదేశానికి చేరుకోవడంతో ఒక్కసారిగా వారు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.ప్రారంభోత్సవ సమయానికి కేవలం 10 నిమిషాలు ఆలస్యంగా ఎమ్మెల్యే రావడాన్ని సైతం కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేదు. మంత్రులు, ఎంపీల పర్యటనలు గంటలు ఆలస్యంగా ప్రారంభమవుతున్నా ప్రజలు వేచి చూడడం లేదా అని పలువురు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం ఎమ్మెల్యే పల్లా రాకముందు ఎలా ప్రారంభిస్తారో చూస్తామంటూ, వారిని అడ్డుకునేందుకు యత్నించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణాబాల్నర్సయ్య, వైస్ చైర్ పర్సన్ మేడిశెట్టి ఉమాశ్రీధర్, కౌన్సిలర్లు నిమ్మ సుప్రజారాజీవ్రెడ్డి, కమలాపురం గీతాంజలి, వీరబత్తిని సదానందం, మహ్మద్ ఎజాస్, కోఆప్షన్ సభ్యుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కామిడీ జీవన్‌రెడ్డి, డైరెక్టర్లు, మార్కెటింగ్ డీఎం నాగరాజు, మాజీ ఎంపీపీలు బద్దిపడిగె కృష్ణారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్, మేక సంతోష్, మంద యాదగిరి, సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి, దాసరి పరశురాములు, బీరెడ్డి ఇన్నారెడ్డి, శివగారి అంజయ్య, సెక్రటరీ, సిబ్బంది పాల్గొన్నారు.