మెదక్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ ) : మిలాద్-ఉన్-నబీ పండగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన పటిష్ఠ బందోబస్తు విజయవంతమైంది. ఈ సందర్భంగా జమాత్-ఇ-ఇస్లామీ ప్రతినిధులు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ను కలిసి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. పండగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లు, ప్రార్థనా మందిరాలు, ఊరేగింపు మార్గాలు, సున్నిత ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ బందోబస్తు నిర్వహించారు.
మిలాద్-ఉన్-నబీ పండగ ప్రశాంతంగా ముగియడం సంతోషకరమన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించడంతోపాటు మత పెద్దలు, ప్రజలు అందించిన సహకారం వల్లే పండగ ప్రశాంతంగా జరిగిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించిన మత పెద్దలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లోనూ అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో పండగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు.