సిద్దిపేట, డిసెంబర్ 10: తెలంగాణ తల్లిని అవమానించిన దుర్మార్గుడు సీఎం రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, బతుకమ్మను తొలిగించడంపై బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం సిద్దిపేట పట్టణం అంబేదర్ చౌరస్తాలోని మోడల్ బస్టాండ్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినదించారు. అనంతరం ఎమ్మెల్సీ దేశపతి మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల కష్టం, వ్యవసాయానికి, సంసృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహంలో ఏర్పాటు చేశామని తెలిపారు. 20 ఏండ్ల కిందటే కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారని, ఆ విషయం కాంగ్రెస్ దుర్మార్గులకు తెలియదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు తొత్తుగా మారి తెలంగాణ రాకుండా అడ్డుపడింది రేవంత్‌రెడ్డి కాదా అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎంగా కేసీఆర్ అయినా నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బ్యాగు బాబ్జీగా రేవంత్ రెడ్డి అవతారమెత్తిన సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజల బాగోగులు చూడమంటే బ్యాగోగులు చూస్తున్న దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. సీఎం సచివాలయంలో ఏర్పాటు చేసింది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, అది కాంగ్రెస్ తల్లి విగ్రహం అని తెలిపారు. చేతిలో జొన్నకర్ర పెట్టగానే తెలంగాణ తల్లి విగ్రహం కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కేటీఆర్ నిలదీస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తూ కాలం వెల్లదీస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ వచ్చాక తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా ప్రపంచంలోని అమెరికా లాంటి దేశాల్లో కూడా బతుకమ్మను ఆడుతున్నారని అందుకు గర్వంగా ఉందని చెప్పారు.
బతుకమ్మ ఆడిన మహిళలు
తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను తొలిగించడంపై మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు, మాజీ ఎంపీపీ శ్రీదేవి, కౌన్సిలర్లు, మహిళా నాయకుల ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు.. బతుకమ్మ చీరలు బంద్ చేశావ్, ఇప్పుడు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తీసేశావ్ అంటూ మండిపడ్డారు. బతుకమ్మ ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం
సిద్దిపేట పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, నాయకులు పాల సాయిరాం తదితరులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు మాజీ జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణ శర్మ, మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు, జాప శ్రీకాంత్‌రెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న గోవిందా.. గోవిందా పాట
రైతుబంధు గోవిందా, పంట రుణమాఫీ గోవిందా, బతుకమ్మ చీరలు గోవిందా, మహాలక్ష్మి గోవిందా, కల్యాణలక్ష్మి గోవిందా, తులం బంగారం గోవిందా అంటూ పాటలు పాడి నిరసన తెలిపారు. తెలంగాణ తల్లి ముమ్మాటికీ మన అందరికీ దేవత అని చెప్పారు. బతుకమ్మతోపాటు తెలంగాణ మహిళలను అవమానించేలా, వారి మనోభావాలను దెబ్బతీశావని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని మేళతాళాలు, డప్పుచప్పుళ్లతో గాంధీభవన్‌కు తరలిస్తామని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ద్రోహిగా మిగిలిన రేవంత్‌రెడ్డి సంసృతి, సంప్రదాయానికి మంగళం పాడారని, బతుకమ్మను తీసేసిన నిన్ను చరిత్ర క్షమించదని విమర్శించారు. తెలంగాణ తల్లి మాది.. కాంగ్రెస్ తల్లి మీదా అ నినదీస్తూ హోరెత్తించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పుట్టిన పోరాటంలో నుంచి పుట్టిన తల్లి తెలంగాణ తల్లి అని పేర్కొన్నారు. కుట్రలు.. కుతంత్రాల నుంచి పుట్టిన తల్లి కాంగ్రెస్ తల్లి అన్నారు.