దుబ్బాక, మార్చి 2: తలాపున మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ సిద్దిపేట జిల్లా దుబ్బాక రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు.బీఆర్ఎస్ హయాంలో మండుటెండల్లో చెరువులు, కుంటలు జలకళతో ఉట్టిపడి, బీడు భూములు సైతం సాగులోకి వచ్చిన ఈ ప్రాంతంలో ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు తలకిందులయ్యాయి. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు వేసవికాలం ప్రారంభంలోనే ఈ ప్రాంతంలోని చెరువులు,కుంటలు గోదావరి జలాలతో నింపేవారు.
దీంతో పంటలు దక్కాయి. ప్రస్తుతం నీరందక చాలాచోట్ల వరిపొలాలు ఎండిపోతున్నాయి. మల్లన్నసాగర్ నుంచి ప్రభుత్వం సకాలంలో నీటిని విడుదల చేయకపోవడంతో కూడవెల్లి వాగు ప్రవాహ సమీప గ్రామాల రైతులకు సమస్య తలెత్తింది. మరోపక్క మల్లన్నసాగర్-4 ఎల్ డిస్ట్రిబ్యూటర్ కాల్వల నిర్మాణం పూర్తికాక పోవడంతో 10 గ్రామాల రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. పొలాలు నెర్రెలు చాచి ఎండిపోతున్నాయి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన వరి కండ్ల ముందు ఎండిపోతుండడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. పశువులకు మేతకు పంటను వదిలేస్తున్నారు.
దుబ్బాక ఏడీఏ పరిధిలో గతేడాది 60వేల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఈఏడాది 40 వేల ఎకరాల్లో మాత్రమే వరి వేశారు. భూగర్భ జలాలు అడుగంటి పోవటం, మల్లన్నసాగర్ నుంచి నీటి సరఫరాలో అంతరాయంతో పంటలు ఎండిపోతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో గత రెండేండ్లు యాసంగి పంటలకు మల్లన్నసాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి నీరు సకాలంలో విడుదల చేశారు.
దీంతో సాగునీటి విషయంలో రైతులకు రంది లేకుండాపోయింది. ఈసారి సాగునీరు విడుదల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లితున్నది. మల్లన్నసాగర్ నుంచి నీరు విడుదల చేయాలని, 4 ఎల్ డిస్ట్రిబ్యూషన్ కాల్వల నిర్మాణం చేపట్టాలని పలుసార్లు మంత్రులకు, సంబంధిత అధికారులకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విన్నవించారు. రైతులు సైతం ధర్నాలు చేశారు. కూడవెల్లి వాగులోకి ఆలస్యంగా సాగునీరు వదలడంతో రైతులకు నష్టం చేకూరింది. మరోసారి నీరు విడుదల చేయకపోవడంతో ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి.
మల్లన్నసాగర్ ప్రధాన కాల్వ నుంచి దుబ్బాక నియోజకవర్గంలోని 4 ఎల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సూమారు 15 కి.మీ పొడవు ఉప కాల్వ నిర్మించాలి. కాల్వ నిర్మాణంతో భూములు పోగొట్టుకుంటున్న రైతులకు పరిహారం అందించకపోవడంతో పాటు తదితర కారణాలతో పనులు అర్ధంతరంగా నిలిచాయి.ఈ ఉప కాల్వల ద్వారా 11 గ్రామాలకు సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. ప్రస్తుతం ఈ కాల్వ నిర్మాణం పూర్తికాకపోవడంతో చీకోడు, ఆరెపల్లి, పోతారం, గంభీర్పూర్, గోసాన్‌పల్లి, శిలాజీనగర్, వెంకటగిరితండాల గ్రామాలకు సాగునీటి సమస్యతో తలెత్తి వరి పంట ఎండిపోతున్నది.
రైతులకు సాగునీటి కష్టాలు తొలగించేందుకు కేసీఆర్ మల్లన్నసాగర్ నిర్మాణం చేపడితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు విడుదల చేయక రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఏడాదిగా మల్లన్నసాగర్ ఉప కాల్వల నిర్మాణాలు పూర్తిచేయాలని, సాగునీరు విడుదల చేయాలని అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. 4ఎల్ డిస్ట్రిబ్యూషన్ కాల్వ నిర్మాణం పూర్తి చేయకపోవడంతో రైతులకు సాగునీటి సమస్య ఏర్పడింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల పంటలు ఎండిపోతున్నాయి.
-కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే
ఐదెకరాల్లో వరి పంట సాగుచేశాను. నీళ్లు లేక పంట మొత్తం ఎండిపోతున్నది. మల్లన్నసాగర్ నుంచి మా ఆరేపల్లి గ్రామానికి నీళ్లు వస్తాయనుకున్నాం. మా పక్క గ్రామమైన కమ్మర్పల్లి వరకు నీళ్లు సరఫరా చేశారు. మా గ్రామంతో పాటు కిందనున్న మరిన్ని గ్రామాలకు నీరు సరఫరా కాలేదు. అధికారుల నిర్లక్ష్యంతో కాల్వలలోకి నీరు విడుదల చేయలేదు. మా గ్రామంలో పెద్ద చెరువు పూర్తిగా ఎండిపోయింది. గ్రామంలో సాగునీరు లేక రైతులందరికీ నష్టం జరిగింది. ఎకరాకు రూ. 20వేలు వరకు పెట్టుబడి పెట్టాం. కష్టం అంతా వృథా అయ్యింది.
– చిట్టి బాలరాజు, రైతు, ఆరెపల్లి
నేను మూడెకరాల్లో వరి పంట వేశాను. నీళ్లు లేక, కరెంట్ సరఫరా లేక వేసిన పంట మొత్తం ఎండిపోయింది. మల్లన్నసాగర్ నుంచి మా గ్రామానికి కాల్వల ద్వారా నీళ్లు వస్తాయని ఎంతో ఆశతో రైతులమంతా ఎదురుచూశాం. కాల్వ నిర్మాణం చేయకపోవడంతో సాగునీటి సమస్య నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మరోపక్క అస్తవ్యస్తమైన కరెంట్ సరఫరాతో పంటకు నీరు అందలేదు. వేసిన పంట మొత్తం ఎండిపోయింది.
-బానోతు శ్రీరామ్, రైతు, వెంకటగిరితండా
నాకు రెండెకరాల భూమి ఉం ది. ఎకరంలో వరి పంట ఏసిన. బోరు పోయకపోవడంతో ఏసిన పంట ఎండిపోయింది. పశువులకు మేతకు వదిలేసిన. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్ప మరేమిలేదు. మా ఊర్లో పొలాలు నెర్రెలు బారాయి. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
– నర్సయ్య, రైతు, చీకోడు