సంగారెడ్డి మార్చి 28 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా సింగూరు ప్రాజెక్టు దిగువన సాగునీరు లేక పంటలు ఎక్కువగా ఎండుతున్నాయి. ప్రాజెక్టు దిగువన పుల్కల్, చౌటకూరు మండలాల్లో 16వేల ఎకరాలకుపైగా రైతులు వరిపంట సాగుచేశారు. ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తాయని రైతులు ఆశించినప్పటికీ నీటిపారుదల శాఖ క్రాప్ హాలిడే పేరుతో రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో రైతులు ఎక్కువగా బోరుబావుల నుంచి నీళ్లు పెట్టుకొని వరి పంటను సాగు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటడంతో బోరుబావులు నీళ్లు పోయటం లేదు. దీనికితోడు కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు నిరంతరం కరెంటు సరఫరా చేయటం లేదు. పుల్కల్, చౌటకూరు మండలాల్లో అనధికారికంగా కరెంటు కోతలు అమలు చేస్తున్నారు.
రైతుల అందజేసిన వివరాల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కరెంటు సరఫరా కావటం లేదు. ఆ తర్వాత కరెంటు సరఫరా అవుతున్నా మధ్యలో కొన్ని గంటల పాటు ఉండటం లేదు. దీంతో వరి పొలాలకు సాగునీరు అందక ఎండిపోతున్నది. లోవోల్టేజీ సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. లోవోల్టేజీ సమస్య కారణంగా ట్రాన్స్ఫార్మర్లు, బోరుమోటర్లు కాలిపోతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క బోరు మోటరు కాలిపోతే రైతు రూ.10వేల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడం, కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యతో పుల్కల్ మండలంలోని పుల్కల్, బస్వాపూర్, ఇసోజిపేట, గొంగ్లూరు, గంగోజిపేట, చౌటకూరు మండలంలో చౌటకూరు, బొమ్మారెడ్డిగూడెం, ఉప్పరిగూడెం, బద్రిగూడెం, కోర్పోల్, సుల్తాన్పూర్లో వరి పంటకు సాగునీరు అందక ఎండిపోతున్నాయి.
దీంతో రైతులు సింగూరు ప్రాజెక్టు నుంచి పంటకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సింగూరు కాల్వల లైనింగ్ పనుల కోసం క్రాప్ హాలిడే ప్రకటించారు. లైనింగ్ పనులు ఇంకా ప్రారంభం కానందున పంటలను కాపాడేందుకు కాల్వల ద్వారా సింగూరు నీటిని వెంటనే విడుదల చేయాలని పుల్కల్, చౌటకూరు మండలాల రైతులు కోరుతున్నారు. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.817 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 20.027 టీఎంసీల జలాలు ఉన్నాయి. ప్రాజెక్టులో జలాలు ఉన్న నేపథ్యంలో కాల్వల ద్వారా పొలాలకు నీళ్లు ఇచ్చి అదుకోవాలని రైతులు కోరుతున్నారు.
బోరుబావుల కింద వరితోపాటు జొన్న, కూరగాయల పంటలను రైతులు సాగు చేశారు. రైతులు సాగుచేసిన జొన్న, కూరగాయల పంటలకు సైతం సాగునీరు లేక ఎండిపోతున్నాయి. నల్లవాగు కింద సైతం పంటలు ఎండిపోతున్నాయి. నల్లవాగు ప్రాజెక్టు కింద సిర్గాపూర్, కల్హేర్ మండలాల్లో సుమారు 600 ఎకరాల్లో సాగునీరు అందక జొన్న, వరి పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. సాగునీరు ఇచ్చి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం, అధికారుల్లో చలనం కనిపించటం లేదు. మరో 10 నుంచి 20 రోజుల పాటు సాగునీరు అందకపోతే జిల్లాలో సగానికి పైగా విస్తీర్ణంలో పంట నష్టపోయే అవకాశం ఉంది.
సాగునీరు లేక రైతు కంట కన్నీళ్లు ఓలుకుతున్నాయి. పచ్చని పైరు కండ్ల ఎదుటే ఎండుతుంటే రైతుల గుండెలు మండుతున్నాయి. ప్రాజెక్టుల్లో నిండుగా నీళ్లున్నా.. పొలాలకు నీళ్లు పారటం లేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు నీళ్లు పోయక పంటలు దెబ్బతింటున్నాయి. కరెంటు కోతలు లోవోల్టేజీలతో బోరుమోటర్లు కాలి రైతుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కేసీఆర్ పాలనలో దిగుబడి, రాబడి కంట చూసిన రైతన్నలు నేడు కాంగ్రెస్ పాలనలో కరువును చవిచూడాల్సి వస్తుంది. సంగారెడ్డి జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి.
ప్రాజెక్టుల దిగువన బోరుబావుల కింద ఇదే పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్లో 1.15 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. జిల్లాలోని సింగూరు, నల్లవాగు ప్రాజెక్టుల కింద వరి, జొన్న, కూరగాయల పంటలు సాగు చేశారు. సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని రైతులు బోరుబావుల కింద అత్యధికంగా వరి, నీళ్ల జొన్న పంటలు సాగుచేశారు. 50వేల ఎకరాల్లో రైతులు వరిపంట సాగు చేశారు.
సింగూరు ప్రాజెక్టు కింద నీటి పారుదల శాఖ క్రాప్ హాలిడే ప్రకటించినప్పటికీ రైతులు 16వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరి పంట సాగుచేశారు. నల్లవాగు ప్రాజెక్టు, చెరువులు, బోరుబావుల కింద 34వేల ఎకరాల్లో రైతులు వరి పంట వేశారు. ప్రస్తుతం వరి పంట నీళ్లులేక ఎండిపోతుంది. ముఖ్యంగా సింగూరు, నల్లవాగు ఆయకట్టు, బోరుబావుల కింద సాగునీరు లేక వరి ఎక్కువగా ఎండుతుంది. నల్లవాగు ప్రాజెక్టు కింద 600 ఎకరాలకు సాగునీరు అందక వరి, జొన్న పంట ఎండిపోయే ప్రమాదం ఉంది. భూగర్భ జలాలు అడుగంటడం, కరెంటు కోతలు, లోవోల్టేజీల కారణంగా బోరబావులు నుంచి నీళ్లు అందక వరి పొలాలు ఎండి
పోతున్నాయి. దీంతో రైతులకు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
పంటలకు ఎత్తిపోస్తున్న రైతులు పుల్కల్ మండలంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. సింగూరు నుంచి సాగునీరు అందక, బోరుబావుల నుంచి నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. కండ్ల ఎదుట పంటలు ఎండిపోతుండడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న తిప్పలు వర్ణనాతీతం. ఇందుకు ముదిమాణిక్యం గ్రామానికి చెందిన రైతు పడమటి శ్రీనును ఉదాహరణగా చెప్పవచ్చు. పడమటి శ్రీనుకు బస్వాపూర్ శివారులో భూములు ఉన్నాయి. సొంతంగా రెండు ఎకరాల పొలం ఉండగా కౌలుకు మరో ఎనిమిది ఎకరాలు తీసుకున్నాడు.
సొంత భూమిలో జొన్న, గోధుమ, ఉల్లిగడ్డ పంటలు సాగు చేశాడు. కౌలుకు తీసుకున్న భూమిలో సైతం జొన్న, గోధుమ పంటలు వేశాడు. రెండు బోర్ల ద్వారా ఎనిమిది ఎకరాల్లో ఉన్న పంటలకు సాగునీరు అందజేస్తున్నాడు. భూగర్భజలాలు తగ్గుముఖం పట్టడంతో బోర్లు నీళ్లు పోయటం తగ్గుముఖం పట్టాయి. దీనికితోడు కరెంటు కోతలు ఇబ్బందికరంగా మారటంతో రైతు శ్రీనుకు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దీంతో బోరుబావి పక్కనే చిన్న బావి తవ్వి అందులో రెండు బోర్ల నుంచి పైపుల ద్వారా నింపుతున్నాడు. బావి నిండాక మోటరు ద్వారా పొలాలకు నీళ్లు ఎత్తిపోస్తున్నాడు. భూగర్భజలాలు లేకపోవడం, కరెంటు సమస్యలు తనకు ఇబ్బందిగా మారాయని, బావి నుంచి నీళ్లు ఎత్తిపోయకపోతే పంటలు ఎండిపోతున్నాయని శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం సింగూరు ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇచ్చి రైతు లను కాపాడాలని డిమాండ్ చేస్తు న్నాడు.
సారూ… నీళ్లులేక పంట ఎండిపోయింది.. ఇప్పుడు ఏమి చేయాలో దిక్కు తోచడం లేదు. నీళ్లు లేక కండ్ల ఎదుటే పంట ఎండిపోతుంటే కండ్లల్లోంచి నీళ్లు వస్తున్నాయి. నాకు ఉన్న 1.50 ఎకరాల భూమిలో అప్పుచేసి మరీ వరి సాగు చేశాను. బోరుబావి కింద వరి సాగు కలిసివస్తుందని అనుకున్నా. ఇప్పుడు బోరు నీళ్లు పోయటం లేదు. నీళ్లు లేక వరిపంట పూర్తిగా ఎండిపోతుంది. పంట పూర్తిగా ఎండిపోతే లక్ష వరకు నష్టం వస్తుంది. ప్రభుత్వం పెద్ద మనస్సు చేసుకుని సింగూరు నుంచి కాల్వల ద్వారా నీళ్లు ఇస్తే నా పంటను బతికించుకుంటా.
– పెంటయ్య, రైతు, పుల్కల్
రెండు ఎకరాల్లో బోరుబావి కింద వరి పంట వేశాను. సాగు కోసం రూ.50వేలకు పైగా ఖర్చు పెట్టాను. ఇప్పుడు బోరుబావిలో నీళ్లు పూర్తిగా ఇంకిపోయాయి. బోరువేస్తే పూర్తిగా నీళ్లు పోయటం లేదు. నీళ్లు లేక వరి పంట పూర్తిగా ఎండిపోతుంది. ప్రభుత్వం సింగూరు కాల్వ నుంచి సాగునీరు ఇచ్చి పంటలను కాపాడాలి. మరోవారం రోజుల్లో కాల్వల ద్వారా సాగునీరు ఇవ్వకపోతే వరి పంట పూర్తిగా ఎండిపోయి నష్టం మిగులుతుంది. ప్రభుత్వం వెంటనే సింగూరు ప్రాజెక్టు ద్వారా పొలాలకు నీళ్లు ఇవ్వాలి.
– సొంగ నర్సింహులు, రైతు, పుల్కల్
కేసీఆర్ పాలనలో రైతులకు సాగునీళ్లు, కరెంటు ఫుల్గా ఉండేవి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో సాగునీళ్లు, కరెంటు నిల్. కరెంటు కోతలు, లోవోల్టేజీతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. లోవోల్టేజీతో మోటర్లు కాలిపోతున్నాయి. దీంతో నీళ్లులేక వరి, కూరగాయల పంటలు ఎండిపోతున్నాయి. లోవోల్టేజీతో మూడు రోజుల క్రితం బోరుమోటరు కాలిపోయింది. ఇప్పుడు పొలానికి నీళ్లు పెట్టలేని పరిస్థితి నెలకొంది. మోటరు మరమ్మతుకు రూ. 9వేలు ఖర్చయింది. ప్రభుత్వం లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలి. కోతలు లేకుండా నిరంతరం 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలి.
– ప్రభాకర్, రైతు, కోడూరు