మునిపల్లి, నవంబర్ 12: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు భూమి కబ్జాకు యత్నం అనే శీర్షికతో బుధవారం నమస్తే తెలంగాణలో వచ్చిన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. ఇరిగేషన్ డీఈ నాగరాజుతో పాటు మునిపల్లి ఇరిగేషన్ ఏఈ, మునిపల్లి ఆర్ఐ, సర్వేయర్లు బుధవారం సింగూరు ప్రాజెక్టు భూములను సందర్శించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చింది.
సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఇరిగేషన్ అధికారులు సింగూరు ప్రాజెక్టు భూములకు మాకు ఎలాంటి సంబంధం లేదంటూ వెళ్లిపోవడంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. భూములు పరిశీలించేందుకు వచ్చే అధికారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లి పోవడం ఏమిటని గ్రామస్తులు మండిపడ్డారు. వారం రోజులు సమయం తీసుకొని సింగూరు ప్రాజెక్టు అధికారులకు సమాచారం అందించి పూర్తి ఆధారాలతో సర్వే చేస్తామని మునిపల్లి ఆర్ఐ,సర్వేయర్లు రైతులకు భరోసా ఇచ్చారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న ‘నమస్తే తెలంగాణ’కు స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.