పటాన్చెరు, ఏప్రిల్ 5: హైడ్రా బూచి పేరుతో కొందరు ఇరిగేషన్ అధికారులు ఎన్వోసీ జారీకి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. హైడ్రా పేరు చెబితే అక్రమార్కుల సంగతేమో కాని చెరువులు, కుంటలు, నాలాలకు సమీపంలో ఇండ్లు కట్టుకున్న వారికి నిద్ర కరువవుతున్నది. జలవనరుల్లో కానీ, ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కూడా లేని ఇండ్లకు సైతం అధికారులు ఎన్వోసీలు ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్జెంట్‌గా ఇండ్లు, ప్లాట్లు, భూములు అమ్ముకుందామనుకుంటే అమ్మకందారులకు ఎన్వోసీ తప్పనిసరిగా మారింది.
ఎన్వోసీ ఇవ్వడానికి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వే పేరిట జాప్యం చేస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసిందే ఆలస్యం, దరఖాస్తుదారుల వద్దకే ఇరిగేషన్ శాఖకు చెందిన బ్రోకర్లు, సిబ్బంది వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. వారు అడిగింది ఇస్తే దరఖాస్తు వేగంగా పరిష్కారమై చేతికి ఎన్వోసీ అందజేస్తున్నారు. రూల్స్ మాట్లాడితే ఇక అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. వారం రోజులైనా, నెలలైనా దరఖాస్తుపై స్పందించడం లేదు. మళ్లీ బ్రోకర్‌ను, ఇరిగేషన్ శాఖ సిబ్బందిని కలిసి అడ్వాన్స్ ఇస్తే ఫైల్ ముందుకు కదులుతుంది. సగం డబ్బులు ఇస్తే జాయింట్ సర్వే జరుగుతుంది. అడిగినంత సొమ్ము అందజేస్తే ఎన్వోసీ అందజేస్తున్నారు. కింది నుంచి పైస్థాయి వరకు ఈ ఎన్వోసీ జారీ ప్రక్రియలో డబ్బులే కీలకం అవుతున్నాయి.
ఎవరు డబ్బులు ఇవ్వకున్నా, రికమెండేషన్ తెచ్చినా పనికావడం లేదు. పైసలిచ్చి పనిచేయించుకోమని సిబ్బంది సూచిస్తున్నారు. అన్నీ కరెక్టు ఉన్నాయని మాట్లాడితే ఏదో ఒక కొర్రీ పెట్టి ఎన్వోసీ ఇవ్వలేమని దరఖాస్తుకు రిమార్క్ పెడుతున్నారు. ఆన్లైన్లో, లేదా పాత మ్యాపులో సమస్య వచ్చిందని నిర్ధాక్షణ్యంగా చెబుతున్నారు. ఆ తర్వాత ఆ ఆస్తి విలువ మార్కెట్లో సగానికి సగం పడిపోతున్నది. రూ.కోట్లు పలకాల్సిన ప్లాట్లు, భూములకు లక్షలు కూడా పలకడం లేదు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖలు రిజెక్ట్ చేశాయంటే, త్వరలో ఆ ప్రాపర్ట్టీని హైడ్రాతో కలిసి కూల్చేస్తారని, గుంజుకుంటారనే భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో బద్నాం అయితే పెట్టిన డబ్బులు రావని ప్లాట్ల ఓనర్లు, భూముల యజమానులు బెంబేలెత్తి డబ్బులు ముట్టజెబుతున్నట్లు తెలిసింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, అమీన్పూర్, జిన్నారం మండలాల్లో వందలాది చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో సగం చెరువులు, కుంటల చుట్టూ కాలనీలు వెలిశాయి. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతం కావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. కాలనీల్లో చెరువుల సమీపంలో ఇండ్లు నిర్మించుకున్న వారికి, నాలాలకు, కాలువలకు సమీపంలో ఉన్నవారు భూములు, ఇండ్లు అమ్మకోవాలన్నా, బ్యాంకు లోన్‌కు వెళ్లాలన్నా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా హైడ్రా భయం లేకుండా నీటిపారుదల శాఖ నుంచి ఎన్వోసీలు పొందాల్సి ఉంటుంది.
చాలా చెరువులు, కుంటలు, వాగుల చుట్టూ వేలాది ఇండ్లు నిర్మించుకోవడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎన్వోసీలు పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బందికి, అధికారులకు వరంలా మారింది. వచ్చిన దరఖాస్తులను ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ శాఖ సర్వేయర్లు జాయింట్ సర్వే చేసి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇరిగేషన్‌శాఖ ఏఈ, సర్వేయర్లు సైట్‌కు వచ్చి ఆన్లైన్లో డిజిటల్ మ్యాపును, నిజాం కాలంనాటి పాత మ్యాపులను పరిశీస్తారు.
ఎఫ్టీఎల్లో ఉంటే నిరాకరిస్తారు. కానీ, బఫర్ జోన్లో ఉంటే, బఫర్ జోన్‌కు అతి దగ్గరగా ఉన్నా బేరాలు ప్రారంభిస్తారు. వంద గజాలకు రూ.లక్షకు మించి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్ని వందల గజాలుంటే అన్ని రూ.లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు న్యాయంగా పనిచేస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు. కానీ, అధికశాతం ఇరిగేషన్ శాఖ సిబ్బంది, అధికారులు డబ్బులు ఇస్తేనే పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హైడ్రా బూచి చూపి ఒక్కో ప్లాటుపై రూ.లక్షలు వసూలు చేస్తున్నారంటే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోంచి వచ్చిన ఎన్వోసీ దరఖాస్తుల విలువ రూ.కోట్లలోనే ఉంటుంది.
శుక్రవారం ఏసీబీ అధికారుల పటాన్చెరు ఇరిగేషన్ డీఈ కార్యాలయం ఎదుట లంచం తీసుకుంటున్న గుమ్మడిదల నీటిపారుదల ఏఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆఫీసుకు వచ్చి తనిఖీ నిర్వహించేందుకు ఏసీబీ సమాయత్తం అవుతున్న విషయం తెలిసి ఇరిగేషన్ ముఖ్య అధికారి అక్కడి నుంచి జారుకున్నారని సమాచారం. ఆ ముఖ్య అధికారి టార్గెట్‌గా ఏసీబీ రైడ్ జరిగిందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తృటిలో తప్పించుకున్న ఆ అధికారిపై అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. లంచం డబ్బులు ఒక్కరే మాట్లాడుతారని, కానీ.. అవినీతి అధికారులు అందరికీ వాటాలు వెళ్తాయని ప్రచారంలో ఉంది.