ఝరాసంగం, జనవరి 29: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామ శివారులోని ఏనుగుల చెరువులో సమృద్ధ్దిగా నీరున్నా ఆయకట్టుకు వాడుకోలేని దుస్థితి నెలకొన్నది. చెరువు కాలువ, తూము శిథిలావస్థకు చేరడంతో నీరు అందే పరిస్థితి లేదు. ఏనుగుల చెరువు కింద 107 ఎకరాలకు ఆయకట్టు ఉంది. మరమ్మతులకు నోచుకోకపోవడంతో కాలువలో గడ్డి, పిచ్చిమొక్కలు, మట్టి నిండిపోయి నీరు ముందుకు వెళ్లలేని విధంగా తయారైంది. కేవలం 27 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నది. ఏడాదిగా నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతో కాలువ ఆనవాళ్లు కనిపించని స్థితిలో గడ్డితో నిండిపోయింది.
కాలువ, తూముకు మరమ్మతులు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేసి పూర్తి ఆయకట్టుకు నీరందించాలని రైతులు విజ్ఞిప్తి చేస్తున్నారు. దీనిపై ఇరిగేషన్ శాఖ ఏఈ జానకీరామ్ను వివరణ కోరగా.. సీసీ కాలువ, తూము మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.
వెంటనే మరమ్మతులు చేపట్టాలి
మాఊరి శివారులోని ఏనుగుల చెరువు అతి పురాతనమైంది. దీని కింద 107 ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ పావుశాతం పొలాలకు కూడా నీరు సరిగ్గా అందడం లేదు. చెరువులో పుష్కలంగా నీరున్నా కాలువకు, తూములకు మరమ్మతులు చేయకపోవడంతో మా పొలాలకు నీరు రావడం లేదు. దిక్కుతోచక వర్షాధార పంటలు వేసుకుంటున్నాం. ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేయించాలి.
– సంగమేశ్వర్, రైతు