మద్దూరు(ధూళిమిట్ట), జూలై 2: యూరియా యాప్ ద్వారా జరిగిన అక్రమాలు ఒక్కక్కొటి వెలుగులోకి వస్తున్నాయి. చేర్యాలలో యూరియా పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. యూరియా అక్రమాలు ఒక్క చేర్యాలకే పరిమితం కాకుండా వివిధ ప్రాంతాల్లో జరిగినట్లు తెలుస్తున్నది. ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లి ‘రైతు సేవా కేంద్రం’లో యూరియా అక్రమాలు జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. బైరాన్‌పల్లి రైతు సేవా కేంద్రంలో యూరియా అందుబాటులో ఉందని యాప్‌లో చూపించడంతో ధూళిమిట్ట మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన రైతు నందనబోయిన కుమార్ మార్చి 8న యూరియా కోసం యాప్‌లో ఐప్లై చేసుకున్నాడు. 9న యూరియా బస్తాల కోసం ట్రాక్టర్ తీసుకుని బైరాన్‌పల్లికి వెళ్లాడు. యూరియా అందుబాటులో లేదని రైతు సేవా కేంద్రం నిర్వాహకుడు తెలిపారు.
యాప్‌లో ఉన్నట్లు చూపడంతోనే తాను యూరియా కోసం ఐప్లె చేసుకున్నానని, రైతు చెప్పినా నిర్వాహకుడు వెనక్కి పంపించాడు. దీంతో చేసేదేమీలేక రైతు ఇంటికొచ్చాడు. ఓటీపీ చెప్పకపోయిన ఫోన్లోకి యూరియా కొన్నట్లు మెసేజ్‌లు రావడంతో అవాక్కైయిన రైతు కుమార్ రైతు సేవాకేంద్రం నిర్వాహకుడిని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానాన్ని దాటవేశాడు. నానా దుర్భాషలాడినట్లు బాధిత రైతు వాపోయాడు. బైరాన్పల్లిలోనూ యూరియాలో అక్రమాలు జరిగాయని గ్రహించిన రైతు ‘వాట్సాప్ గ్రూప్’ల్లో తన గోడును వెల్లబోసుకున్నాడు. దీనిపై ధూళిమిట్ట ఏవో అఫ్రోజ్‌ను వివరణ కోరగా లిఖితపూర్వకంగా రైతు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.