మనూరు, మే 13: అధికారులు ఇష్టారాజ్యంగా జొన్నలు కొనుగోలు చేస్తూ రైతులకు నష్టం చేస్తున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మనూరు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. మనూరు జొన్నల కొనుగోలు కేంద్రంలో అధికారులు వారికి నచ్చిన రీతిలో కొనుగోలు చేస్తున్నారని రైతులు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారులు కుమ్మక్కై రైతులను దోపిడీకి గురిచేస్తున్నారని ఆరోపించారు.
క్వింటాలుకు 5 నుంచి 6కిలోల చొప్పున కడ్తా తీసుకుంటు, డబ్బులు ఇస్తేనే కాంటా చేస్తామని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతుల జొన్నలు కొనుగోలు చేయకుండా పక్కరాష్ట్రం నుంచి వచ్చిన జొన్నలకు డబ్బులు తీసుకుని కాంటా చేస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్ర రైతుల కోసం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్టుగా అధికారుల తీరు ఉందని విమర్శించారు. మనూరు మండల కేంద్రంలో ఇప్పటి వరకు రూ.13 లక్షల అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
కొనుగోలు కేంద్రం లో అక్రమాలపై విలేకరులు వార్తలు రాస్తే, వారు డబ్బులు అడుగుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం భూపాల్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్డీవో కొనుగోలు కేంద్రానికి వచ్చి బస్తా కాంటా వేస్తే 53 కిలోలు వచ్చిందన్నారు. జిల్లా అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విఠల్‌రావు పాటిల్, మాజీ ఎంపీటీసీ ముజామ్మిల్, నాయకులు నాగేందర్ పాటిల్, మన్నన్ రైతులు ఉన్నారు.