పెద్దశంకరంపేట, నవంబర్ 18: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో (2023-24 ఆర్థిక సంవత్సరానికి) ఉపాధి హామీ పనులకు సంబంధించి సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సామాజిక తనిఖీలో అక్రమాలు వెలుగు చూశాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలో అవినీతికి పాల్పడిన ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెన్షన్ చేసినట్లు మెదక్ అడిషనల్ డీఆర్డీవో రంగాచారి తెలిపారు.
మండలంలో 2023-24 సంవత్సరానికి రూ. 5కోట్ల 48 లక్షల 71వేల పనులు చేపట్టగా ఇందులో 20067 పనులు ఉన్నాయన్నారు. బద్దారం, గొట్టిముక్కుల, చీలపల్లి గ్రామాల్లో ఉపాధిహామీ పనుల్లో భారీ అవినీతి జరగడంతో ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రవీణ్, శివయ్య, వెంకటేశాన్ని సస్పెన్షన్ చేసినట్లు వివరించారు. అన్ని గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు కలిపి రూ. 63వేల 600 జరిమానా విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీవీవో శ్రీహరి, హెచ్ఆర్ రాజేందర్రెడ్డి, పీసీ జ్యోతి, ఎంపీడీవో రఫీకున్నీసా తదితరులు పాల్గొన్నారు.