మద్దూరు(ధూళిమిట్ట), జనవరి 9: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ (ఈజీఎస్) పథకంలో జరిగిన రూ.9.60 కోట్లతో చేసిన 1122 పనులకు సామాజిక తనిఖీ నిర్వహించారు. గురువారం మద్దూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఉపాధిహామీలో లక్షలాది రూపాయలు అక్రమాలు జరిగినట్లు తనిఖీ బృందం వెల్లడించింది. ప్రధానంగా పని జరగకపోయినా పని జరిగినట్లు రికార్డుల్లో పొందుపర్చడం, మస్టర్లో సంతకాలు లేకుండా చెల్లింపులు చేయడం, తక్కువ పనికి ఎక్కువ చెల్లింపులు జరిగినట్లు తనిఖీ బృందం నిర్ధారించింది. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం, జాబ్‌కార్డులు అప్‌గ్రేడ్ చేయకపోవడం, కూలీలకు పేస్లిప్లు అందజేయక పోవడం, ఏడు రకాల రిజిస్టర్లను నిర్వహిం చకపోవడంపై వీఆర్పీలు ప్రజావేదికలో నివేదించారు.
ఉన్నతాధికారుల దృష్టికి ‘నేమ్‌బోర్డుల’ అంశం…
ఉపాధిహామీ పథకంలో జరిగిన పని వివరాలు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో పని ప్రదేశంలో పని వివరాలను నేమ్‌బోర్డులో పొందుపర్చి, పని ప్రదేశంలో నేమ్‌బోర్డులను ఏర్పాటు చేయాలని ఉపాధిహామీ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అదేమీ తమకు పట్టదన్నట్లుగా ఉపాధిహామీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనంపై గురువారం ‘నమస్తే తెలంగాణ దిన పత్రిక’ జిల్లా ఎడిషన్‌లో ‘ఈజీఎస్ నేమ్ బోర్డులపై నిర్లక్ష్యమేలా..”అని కథనాన్ని ప్రచురించిది. నేమ్‌బోర్డుల అంశాన్ని సామాజిక తనిఖీ బృందం సైతం ప్రజావేదిక దృష్టికి తీసుకవచ్చింది. ఎనిమిది నెలల కాలంలో సుమారు 350 పనులకు రూ. 1300 చొప్పున శ్లోక ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు మరో వ్యక్తికి చెందిన సంస్థకు ఈజీఎస్ ద్వారా రూ.45,500 చెల్లింపులు జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. చెల్లింపులు జరిగినప్పటికీ పని ప్రదేశంలో నేమ్‌బోర్డులు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంస్థలతో పాటు అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. సామాజిక తనిఖీలో అడిషనల్ డీఆర్డీవో బాలకృష్ణ, ఏపీడీ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీడీవో రామ్మోహన్, క్యూసీ సంతోశ్, పీఆర్ ఏఈ వినయ్‌కుమార్, ఈసీ పరశురాములు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.