గజ్వేల్, మే 30: ప్రజలకు ఒకే చోట ప్రభుత్వాధికారుల సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రానికి సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనాలు మంజూరు చేసింది. ప్రజలకు అవసరమయ్యే సేవలన్నీ ఒకే చోట అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ హయాంలో భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరుకాగా నమూనాగా గజ్వేల్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్(ఐవోసీ) నిర్మించాలని నిధులు మంజూరు చేశారు. అప్పట్లోనే భవనాల నిర్మాణ పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు బిల్లులు రావడం లేదని మధ్యలోనే వదిలేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని ములుగు మండల కేంద్రంలో పిలర్ల దశలో వదిలేయగా, మర్కూక్ మండల కేంద్రంలో చివరి దశలో పనులు మిగిలి ఉండగా బిల్లులు రావడం లేదని అసంపూర్తిగా నిలిపివేశారు. జగదేవ్‌పూర్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. వర్గల్ మండల కేంద్రం లో స్థలం లేక నిర్మాణ పనులు ప్రారంభించలేదు. కొండపాక మండల కేంద్రంలో రూ.7.12కోట్లతో పనులు పూర్తవడంతో ఒకే ఒక ఐవోసీ భవనం అందుబాటులోకి రావడంతో ప్రారంభించారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఐవోసీ భవనాల నిర్మాణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఒక్కో భవనానికి రూ.5 నుంచి రూ.10కోట్ల వరకు అంచనా వేసి మం జూరు చేశారు. ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో బిల్లులు సకాలంలో రాకపోవడంతో కాంట్రాక్టర్లు కొన్ని చోట్ల చివరి దశలో, మరికొన్ని చోట్ల పిల్లర్ల దశలో అసంపూర్తిగా నిలిపివేశారు. ఒకేచోట ఇంటిగ్రేటెడ్ భవనాలు అందుబాటులోకి వస్తే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లోని సేవలు దగ్గరవుతాయనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం భవనాలకు నిధులు మంజూరు చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భవనాల నిర్మాణాలు పూర్తి చేయించడంలో చొరవ చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.