హుస్నాబాద్‌టౌన్, సెప్టెంబర్ 12 : అస్తవ్యస్తంగా నిర్మాణాలు.. ఆపై నిధుల విడుదలపై నిర్లక్ష్యం వెరసి క్రీడలకు ఆటంకాలు.. పైగా ఎప్పుడు కూలిపోతుందో అనే భయం.. ఇదీ గత ప్రభుత్వంలోని ఆసంపూర్తిగా నిర్మించి వదిలేసిన ఇండోర్ స్టేడియం. కానీ నేడు బ్యాడ్మింటన్ క్రీడలను ప్రోత్సహించడం తో పాటు క్రీడాకారులను తయారుచేసే విధంగా హుస్నాబాద్‌లో నూతనంగా ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని క్రీడాకారులకు హామీ ఇవ్వడమే కాకుండా ఇండోర్‌స్టేడియం నిర్మింపజేసి హామీని నిలబెట్టుకున్నారు ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్. పైగా ఇటీవలే పురపాలకశాఖమంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభింపజేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
రూ.1.30కోట్లతో ఇండోర్‌స్టేడియం
పట్టణ శివారులోని మినీస్టేడియంలోని ఐదుగుంటల స్థలంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి 2018లో శంకుస్థాపన చేశారు. ఇందుకు గానూ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్కల్చర్కు చెందిన రూ. 1.30 కోట్లు సైతం మం జూరు చేశారు. ఈ నిధులతో అంతర్జాతీయ స్థాయికి సమాన స్థాయిలో ఉండేవిధంగా రెండు ఉడెన్ కోర్టులను నిర్మించారు. క్రీడాకారులు, ప్రేక్షకులు కూర్చొనేందుకుగానూ ప్రత్యేకంగా బాల్కానీ, క్రీడాకారులకు, అధికారుల కోసం రెండు ప్రత్యేక గదులను నిర్మించారు.
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
హుస్నాబాద్ పర్యటన సందర్భంగా నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందలాది మంది క్రీడాకారులు ఇండోర్‌స్టేడియం ప్రారంభం కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
14 ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నాం..
హుస్నాబాద్‌లో ఇండోర్‌స్టేడియం కోసం 14 ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. సరైన నిధులు కేటాయించకపోవడంతో నిర్మాణపనులు నిలిచిపోయాయి. ఇప్పటికైనా స్టేడియంలో ప్రత్యేకంగా ఇండోర్‌స్టేడియాన్ని నిర్మించడంతో క్రీడాకారులకు ఎంతో మేలు జరగనున్నది.
-గంగిశెట్టి అఖిల్ క్రీడాకారుడు, హుస్నాబాద్
అంతర్జాతీయస్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా నిర్మించాం..
గత ప్రభుత్వాలు కూలిపోయే విధంగా ఇండోర్ స్టేడియం పనులు చేయడమే కాకుండా కాంట్రాక్టర్లకు సైతం డబ్బులు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండోర్ స్టేడియం నిర్మిస్తామనే మాట చెప్పి నిలబెట్టుకున్నాం. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని నిర్మించాం. హుస్నాబాద్ ప్రాంత యువకులు మంచి క్రీడాకారులుగా తయారుకావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
-వొడితెల సతీశ్‌కుమార్ ఎమ్మెల్యే, హుస్నాబాద్
మంత్రి, ఎమ్మెల్యే సహకారంతో నే..
హుస్నాబాద్‌లో ఇండోర్‌స్టేడియాన్ని మంత్రి హరీశ్‌రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ సహకారంతో నిర్మించాం. ఇండోర్ స్టేడియాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీఇచ్చిన విధంగానే నిర్మించి హామీ నిలబెట్టుకున్నారు.
-ఆకుల రజితావెంకన్న, మున్సిపల్ చైర్పర్సన్ హుస్నాబాద్
క్రీడాకారుల కల నెరవేరింది..
హుస్నాబాద్ క్రీడాకారుల కలనెరవేరుతున్నది. చాలా మంచి శుభపరిణామం హుస్నాబాద్ క్రీడాకారులకు ఆరుబయట ఆడుకునే బ్యాడ్మింటన్ ఆట ఇక నుంచి ఇండోర్‌స్టేడియంలో ఆడుకునే అవకాశం వచ్చింది. దీన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి.
-వడ్డెపల్లి వెంకటరమణ, ఉపాధ్యక్షుడు బ్యాడ్మింటన్ అసోసియేషన్ హుస్నాబాద్