కొమురవెల్లి, మార్చి 14 : ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతున్న గాయత్రి ఈ మధ్య రోజూ తలనొప్పి అంటున్నది. పరీక్షలు గుర్తుకొస్తే అర చేతుల్లో చెమటలు పడుతున్నాయి. పుస్తకం తీసి చదువడం మొదలు పెట్టిన కొద్దిసేపటికే గజిబిజి ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. ఇది ఒక్క గాయత్రి పరిస్థితే కాదు.. పది, ఇంటర్, డిగ్రీ చదివే అనేక మంది విద్యార్థులు పరీక్షలు దగ్గర పడుతున్నకొద్దీ ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా ఒత్తిడి కొనసాగితే కష్టపడి చదివింది కూడా గుర్తుకు రాదు.
పరీక్షల్లో సరిగ్గా రాయలేక పోతామనే భావన వారిని మరింతగా భయపెడుతుంది. ఇది విద్యార్థి స్వయంగా సృష్టించుకునే ఒత్తిడి. పాఠ్యాంశాల క్లిష్టత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు ఒత్తిడిని పెంచుతాయి. పరీక్షలు అనగానే చాలామంది విద్యార్థులకు భయంతో మెదడు మొద్దుబారిపోతుంది. ఈ పరిస్థితిలో చదువలేరని సైకాలజిస్టులు, విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో ఈ నెల 15నుంచి జరుగనున్న ఇంటర్ పరీక్షల సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యార్థులు పాటించాల్సిన వాటి గురించి పలు సూచనలు చేస్తున్నారు.
పోలిక వద్దు
చదువుకునేటప్పుడు ఇతరులతో, వారి మార్కులతో పోల్చుకోవద్దు. పోల్చుకోవడం వల్ల ఆత్మన్యూనతా భావం వస్తుంది. దాంతో అసూయ, ఈర్శ్య కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యక్తులతో కాకుండా గతంలో మీరు చదివిన విధానాన్ని, ఇప్పుడు చదువుతున్న విధానాన్ని పోల్చుకోవాలి. మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకండి. మీరు మీ కుంటుంబం కోసమో, చదివే విద్యాసంస్థ కోసమో, మీ మీద ఉపాధ్యాయులు పెట్టుకున్న అంచనా కోసమో చదువడం లేదు. మీరు మీ ఉజ్వల భవిష్యత్తు కోసం చదువుతున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి.
ఒత్తిడిని అధిగమించాలి
పరీక్షల ఒత్తిడిని అధిగమించడానికి విశ్వాసం, పట్టుదల, సంకల్పం, ఏకాగ్రత పునాదులపై విజయ సాధనాన్ని నిర్మించుకోవాలి. గతంలో ఎప్పుడో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన ఎప్పుడూ అలాగే రావు. తక్కువ మార్కులు రావడానికి కారణాలను మాత్రమే విశ్లేషించుకోవాలి. తప్పులు చేసినట్లు అనిపిస్తే వాటిని తిరిగి చేయకుండా జాగ్రత్త పడాలి.
నేను చేయగలను
పాఠ్యాంశాన్ని క్రమ పద్ధతిలో చదువుతూ ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకుంటుండాలి. ఒక్కో అధ్యాయం చదివి.. చూడకుండా రాసుకుంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేనే చేయగలను అన్న నమ్మకం ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను పెంచుతుంది.
స్పష్టమైన లక్ష్యంతో…
రాబోయే పరీక్షల్లో ఎన్ని మార్కులు సాధించాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి. లక్ష్యం మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. స్పష్టమైన లక్ష్యం, ప్రణాళికతో ముందుకు దూసుకుపోవాలి. అప్పుడే అనుకున్న గమ్యానికి చేరుకుంటారు.
20 శాతంలోపు ఓకే..!
ఒత్తిడి ఎప్పడూ చెడ్డది కాదు. మీ శక్తిసామర్థ్యాలను వెల్లడించడానికి అది ఉపయోగపడుతుంది. మీ ఒత్తిళ్లు 10శాతం నుంచి 20శాతం ఉంటే విజయాన్ని ప్రోత్సహిస్తుంది. మంచి నిద్ర, సమతుల ఆహారం, ఆకుకూరలు, పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా శక్తి వస్తుంది. చూడకుండా రాయండి
చదివిన ప్రతిదీ చూడకుండా రాయాలి.
పరీక్షల్లో తప్పులు లేకుండా రాసినదానికే మంచి మార్కులు వస్తాయి. రాస్తే సమయం వృథా కాదు. సాధన వల్లే సామాన్యులు అసామాన్యులుగా మారుతారు. పరీక్షలు దగ్గర పడుతున్నా కొద్దీ రెట్టింపు ఉత్సాహంతో చదువాలి. కష్టమైన సబ్జెక్టుకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చి ముందుగా పూర్తి చేయాలి.
ఈ లక్షణాలు ఉంటే ఒత్తిడి ఉన్నట్లే..
ఈ లక్షణాలు ఉంటే విద్యార్థి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడని తల్లిదండ్రులు గుర్తించి వాటి పరిష్కారం దిశగా ఆలోచించాలి. వారిని దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పాలి. పరీక్షలపై అవగాహన కల్పించాలి. లక్ష్యం దిశగా ప్రేరేపించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
* బాగా నిద్రపోవడం లేదా నిద్ర లేకపోవడం, బాగా ఆకలిగా ఉండడం, ఏదీ తినబుద్ది కాకపోవడం.
* పరీక్షలు దగ్గర పడుతుంటే అవి వాయిదా పడాలని కోరుకోవడం.
* పుస్తకాలు ముందే వేసుకుని భవిష్యత్తు, గతం గురించి ఆలోచిస్తూ చదవాలా? వద్దా? అని సందిగ్ధంలో పడుతుంటారు.
* ఎవరితోనూ మాట్లాడాలని అనుకోకపోవడం.
* ఏ కారణం లేకుండా సందేహాలు, భయాలు రావడం, ఏడుపు వాతావరణం ఉంటుంది.
* పొట్టలో ఏదో ఉన్నట్లు అనిపించడం, స్పృహ కోల్పోయినట్లు తరచూ వణుకుతూ చెమటలతో గొంతు తడి ఆరిపోతుంది.
* చదివే ముందు వేర్వేరు ఆలోచనలు వచ్చి తలనొప్పి రావడం. దానిని నివారించలేక పోవడం సర్వసాధారణం. భవిష్యత్తు గురించి ఎక్కువగా మాట్లాడటం, అనవసరమైన వాటిపై అధిక ఆసక్తి చూపడం, పగటి కలలు కనడం చేస్తుంటారు.
సాధన దిశగా
అనుకున్న పని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలంటే దాన్ని కాగితంపై రాసుకుని ఆధ్యయన గదుల్లో గోడపై అంటించుకోవాలి. రోజూ దాన్ని చూస్తుండాలి. అది కర్తవ్యాన్ని గుర్తు చేసి లక్ష్యసాధన దిశగా ప్రేరిపిస్తుంది.
అన్నీ సులువే..
పరీక్షలు దగ్గర పడుతుంటే చదువని పాఠ్యాంశాలు భయపెడుతుంటాయి. చదువకుండా వాయిదా వేస్తే సమయం దగ్గర పడుతున్నా కొద్దీ భయం ఎక్కువవుతుంది. కాబట్టి ఇప్పుడే మొదలు పెట్టండి. ఏదైనా నేర్చుకునే వరకు కష్టంగా ఉంటుంది. నేర్చుకుంటే అన్నీ సులువే.