చేర్యాల/మద్దూరు(ధూళిమిట్ట), జూన్16: ఉమ్మడి మద్దూరు మండలంలోని కమలాయపల్లి వెలగలరాయుని చెరువు నుంచి కొన్ని నెలలుగా కొంతమంది ఇసుక అక్రమంగా తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువులో జేసీబీలను పెట్టి పెద్ద ఎత్తున ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా పరిసర గ్రామాలతో పాటు సిద్దిపేట, చేర్యాల తదితర పట్టణాలకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ. 6 నుంచి 10వేల వరకు సంపాదిస్తున్నారు. కొంతమంది అక్రమార్కులు వర్షాకాలంలో ఇసుక లభ్యం కాదని చెప్పి ముందు చూపుతో తమ వ్యవసాయ బావులు, రహస్య ప్రదేశాల్లో ఇసుకను డంపు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల కితం గ్రామస్తుల ఒత్తిళ్ల మేరకు చేర్యాల రెవెన్యూ అధికారులు కొన్ని డంపులను సీజ్ చేసి, ఆ సీజ్ చేసిన ఇసుకను నామమాత్రంగా వేలం నిర్వహించారు. వేలంలో ఇసుక దక్కించుకున్న కొంతమంది దానికి రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు పొందారు. అయితే ఆ అనుమతుల చాటున చెరువు నుంచి ఇసుకను తవ్వి అమ్ముకుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో ఆ ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకొని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు ఆ ఇసుకకు అనుమతులు ఉన్నాయని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని స్థానికులు తెలిపారు.
కమలాయపల్లి చెరువు నుంచి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఆదివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో మద్దూరు పోలీసులు గ్రామానికి చేరుకొని గ్రామస్తులు పట్టుకున్న రెండు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.