రామాయంపేట, జూన్ 21 : ప్రజల సౌకర్యార్థం మెదక్ జిల్లా రామాయంపేట బల్దియాలో బీఆర్ఎస్ హయాంలో రూ.2 కోట్ల నిధులతో శ్రీకారం చుట్టిన సమీకృత మార్కెట్ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి.రామాయంపేట పట్టణం మీదుగా జాతీయ రహదారి-44 వెళ్తున్నది. పట్టణంలో సుమారు 30 వరకు జనాభా ఉన్నది. రోజురోజుకు పట్టణం విస్తరిస్తున్నది. వీటిని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ సర్కారు రామాయంపేటలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు మొదలు పెట్టింది. పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే ఎన్నికలు వచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి గ్రహణం పట్టింది.
చేపట్టిన పనులకు బిల్లులు ప్రభుత్వం ఇవ్వక పోవడంతో కాంట్రాక్టర్ పనులు మధ్యలో ఆపేశాడు. రామాయంపేట పట్టణ వాసులతో పాటు ఇతర మండలాల నుంచే వచ్చే వ్యాపారులకు అందుబాటులో ఉండేలా ఎంపీపీ కార్యాలయ సమీపంలో రెండంతుస్తులో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పనులు ప్రారంభించి మూడేండ్లు గడుస్తున్నా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం పూర్తిచేయడంపై దృష్టిసారించడం లేదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు రూ.2కోట్ల నిధులు మంజూరు చేసింది. కాంట్రాక్టర్‌కు కేవలం 20శాతం బిల్లులు మాత్రమే వచ్చాయి. మిగతా బిల్లులు రాకపోవడంతో పనుల్లో పురోగతి కరుమైంది.
పూర్తిచేస్తే పట్టణవాసులకు సౌకర్యం
రామాయంపేటలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందుబాటులోకి వస్తే పట్టణవాసులకే కాకుండా చుట్టుపక్కల మండలాల వ్యాపారులకు,కొనుగోలుదారులు,రైతులకు మేలు జరుగుతంది. ఒకే ప్రాంగణంలో కూరగాయలు, మాంసం, ఇతర విక్రయాలు చేపట్టేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం రామాయంపేట పట్టణంలో బుధవారం వారం సంత జరుగుతుంది. మిగతా రోజుల్లో కొద్దిరోజుల పాటు చర్చి ప్రాంగణంలో కూరగాయల విక్రయాలు జరిగాయి. చర్చి వాళ్లు అక్కడ వద్దనడంతో కొద్దిరోజుల పాటు మెదక్ రోడ్డులో కూరగాయల విక్రయాలు జరిగాయి.
ప్రస్తుతం పాత మార్కెట్లో ఇబ్బందుల మధ్య, అసౌకర్యాలతో కూరగాయల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అక్కడ రద్దీ ఉంటున్నది. సౌకర్యాలు లేవు. వర్షాకాలం వానకు, బురదతో వ్యాపారులు, పట్టణవాసుల బాధలు అంతా ఇంతాకావు.మార్కెట్ రోడ్డు వెంట వెళ్లలేని పరిస్థితి ఉంటుంది.బురద మయంగా పరిసరాలు ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రాత్రిపూట దొంగల భయం వేధిస్తున్నది. ప్రతి వారం కనీసం పది వరకు సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, అధికారులు చొరవ తీసుకుని సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలని ప్రజలు,వ్యాపారులు, కొనుగోలుదారులు కోరుతున్నారు.
మార్కెట్‌కు పోతే దొంగల భయం..
రామాయంపేట కూరగాయల మార్కెట్‌కు పోవాలంటేనే దొంగల భయంతో పోతలేము.ప్రతి వారం దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రద్దీగా ఉంటుండడంతో సెల్ఫోన్లు, మెడలో ఉన్న బంగారు ఆభరణాలు మాయం అవుతున్నాయి. మార్కెట్లో కనీస సౌకర్యాలు లేవు. ఎంపీపీ కార్యాలయ వద్ద నిర్మిస్తున్న కొత్త మార్కెట్‌ను తొందరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలి.
-దేవుని సుజాత, రామాయంపేట
కూరగాయల మార్కెట్‌కా మేమెల్లం బాబు
అమ్మో కూరగాయల మార్కెట్ కంటేనే భయమేస్తుంది.మా మెడలో ఉన్న బంగారం ఉంటదనే గ్యారంటీ లేదు.మేము కూరగాయల వ్యాపారం చేస్తే దొంగోడు వాడిపని వాడు చేసుకుంటడు.ఇప్పటికే ఎంతోమంది మహిళలవి బంగారం ఇతర వస్తువులు పోయినయి. మార్కెట్లో ఏమి సౌలతులు లేవు. రామా యంపేట పట్టణంలో నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్‌ను తొందరగా నిర్మిస్తే తమకు బాధలు పోతాయి.
– దేవుని బుజ్జమ్మ, గృహిణి, రామాయంపేట