మెదక్ అర్బన్, నవంబర్ 4: కౌంటింగ్ సెంటర్లలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు ఆదేశించారు. శనివారం సాధారణ ఎన్నికలు 2023లో భాగంగా స్థానిక వైపీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మెదక్ 34, నర్సాపూర్ 37 నియోజక వర్గాల్లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ కౌంటింగ్ రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటర్నెట్, మీడియా పాయింట్, బారికెడ్లు, విద్యుత్ సరఫరా, తాగునీరు లాంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్‌తో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, మెదక్, హవేళీఘనపూర్ తహసీల్దార్లు శ్రీనివాస్, నారాయణ, ఆర్అండ్బి అధికారి సర్దార్‌సింగ్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆర్వో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్
నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆర్వో కార్యాలయాన్ని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా శనివారం సందర్శించారు. ఆర్వో కార్యాలయంలో ఉన్న వసతులు, సదుపాయాలు, నామినేషన్ వేసే అభ్యర్థుల వివరాలు నమోదు చేసే రికార్డులను పరిశీలించారు. అభ్యర్థి నామినేషన్ వేసే సమయంలో అధికారులు జాగ్రత్తగా పత్రాలను సరి చూడాలని అధికారులకు సూచనలు, సలహాలు అందజేశారు. ఈసీఐ మార్గదర్శకాలు, నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులు సమర్పించే నామినేషన్ పత్రాలను తప్పులు లేకుండా చెక్ లిస్ట్ ఆధారంగా సరిచూసుకోవాలన్నారు. కలెక్టర్‌తో ఆర్వో శ్రీనివాస్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.