పటాన్చెరు రూరల్, డిసెంబర్ 2: ఎలమందది ఔటర్ రింగురోడ్డుకు కూతవేటు దూరం ఉన్న గ్రామం. ఆయనకు రోడ్డుకు ఆనుకుని రెండెరాలు పొలం, పది బర్రెలు, కొన్ని గొర్రెలు ఉన్నాయి. భూముల ధరలు కోట్ల రూపాయలకు చేరడంతో ఎలమంద వద్దకు రియల్ వ్యాపారులు, బ్రోకర్లు తరుచూ వస్తూ భూమి అమ్మాలని, లేదంటే ఆ జాగలో వెంచర్ వేసి పార్ట్నర్షిప్ ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. అదే సమయంలో గ్రామ మాజీ నాయకులు కూడా ఎలమందకు కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు వ్యవసాయం, పశుపోషణ ఎందుకు చేస్తావని హితబోధ చేశారు. కార్లలో లగ్జరీ జీవితం అనుభవించవచ్చని లేని ఆశలు రేపారు.
గ్రామ ప్రముఖులు అరచేతిలో స్వర్గం చూపడంతో తన రెండెకరాలను అమ్మకానికి ఎలమంద అగ్రిమెంట్ చేశాడు. దీంట్లో భాగంగా కోట్ల రూపాయలు తన బ్యాంక్ అకౌంట్లో జమయ్యాయి. మిగిలిన బ్యాలెన్స్ తన అకౌంట్లో విడత వారీగా వేస్తామని కొనుగోలుదారుతో అగ్రిమెంట్ కుదిరింది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రామంలోని చోటా నాయకులు, పలు పార్టీల కార్యకర్తల దృష్టి ఎలమందపై పడింది. ఈ మధ్యే వచ్చిన భూమి అమ్మకం అడ్వాన్స్ డబ్బులను దృష్టిలో పెట్టుకొని ఎలమందను ఎన్నికల బరిలోకి లాగేందుకు స్కెచ్ వేశారు.
పని ఉన్నా, లేకున్నా చోటా నాయకులు ఎలమందను పలకరిస్తున్నారు. ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీచేస్తే తప్పకుండా గెలుస్తావని నూరిపోయడం ప్రారంభించారు. ఒక్కొక్కరు ఇంటికి వచ్చి, ధాబా హోటల్‌కు తీసుకెళ్లి దావత్ ఇచ్చి.. నీవు ఎన్నికల బరిలో ఉంటే గెలవడం ఖాయమని నూరిపోయడం ప్రారంభమైంది. నీ కంటే మొనగాడు, డబ్బున్నవాడు ఈ ఊర్ల ఎవడూ లేడని ఆకాశానికెత్తారు. ఆ వెంటనే ఎలమంద ఎన్నికల్లో బరిలో దిగుతున్నాడని సోషల్ మీడియాలో ఆయన ఫొటోతో ప్రచారం షురూ చేశారు. దీంతో ఎలమంద మనసు రాజకీయాలపైకి మళ్లింది.
కాబోయే సర్పంచ్ ఎలమందనే..
ఎన్నికల్లో పోటీ చేస్తే డబ్బులన్నీ సత్తేనాష్ అవుతాయని ఎలమందకు అతని భార్య, తల్లిదండ్రులు హితబోధ చేశారు. కానీ, ఇప్పటికే తాను సర్పంచ్‌గా గెలిచాననే భ్రమలోకి చేరిన ఎలమంద కుటుంబీకుల హితవు మాటలు చెవికెక్కలేదు. చివరికి ఎన్నికల నామినేషన్ల డేట్లు ప్రకటించడంతో పెద్ద బ్యాచ్ అంతా ఎలమంద ఇంటి ముందు గుమిగూడింది. ఎలమంద జిందాబాద్ అంటూ హోరెత్తించింది. కాబోయే సర్పంచ్ నువ్వే అంటూ నమ్మబలికారు.
ఇక ఎలమందకు సర్పంచ్‌గా గెలిచినంత బలం వచ్చింది. వెంటనే కార్యకర్తలకు, చోటా నేతలకు అభివాదం చేసి మనం నామినేషన్లు వేస్తున్నామని ప్రకటించాడు. అదే క్షణం సినిమాల్లో మాదిరిగా అందరూ ఎలమందను భుజానికి ఎక్కించుకుని గ్రామంలో ఊరేగించారు. ఎలమంద జిందాబాద్ నినాదాలతో గ్రామంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అదే ఊపులో ఇంటికి వచ్చిన ఎలమంద బ్యాంక్‌కు చెక్‌బుక్‌తో బయలు దేరాడు. తెల్లారి నామినేషన్ ఖర్చుకోసం డబ్బులు డ్రా చేసేందుకు.! సాయంత్రానికల్లా గ్రామంలో ఎలమంద నిలువెత్తు ఫ్లెక్సీలు వెలిశాయి.!! ఎలమంద అభిమాన సంఘాలు పుట్టుకొచ్చాయి.!!!
వైన్స్‌లో అకౌంట్..
దగ్గరలోని వైన్ షాపులో ఎలమంద పేరున అకౌంట్ ఒపెన్ చేయించారు. ఆ రాత్రికే వైన్స్ వద్ద, ఎలమంద ఇంటి వద్ద గెలిచినంత సంబురాలు జరిగాయి. తెల్లావారి ఎలమంద కార్యకర్తల బృందం, యువసేన జనసమీకరణ చేశారు. ఒక్కొక్కరికి రోజుకు రూ. 500, ఒక బీర్ బాటిల్, ఒక బిర్యానీ ఇవ్వాలనే కండీషన్‌తో భారీ జనసమీకరణ జరిగింది. ఇక నామినేషన్‌కు ముందు ఎలమంద ఇంటి ముందు పేలిన పటాకులు, రాకెట్లు పక్క ఊర్ల వరకు సౌండ్ చేయడంతో చర్చనీయాంశమైంది. ఎలమంద ఒపెన్‌టాప్ జీపులో గజమాల తొడిగి నామినేషన్ వేసేందుకు పెద్ద ర్యాలీతో బయలుదేరాడు.
ఎలమంద ర్యాలీని ప్రజలు విస్తు పోతూ ఆశ్చర్యంగా చూశారు. ఇలాంటి ర్యాలీ ఏ నాయకుడు తీయలేదనే ప్రచారం అప్పుడే గ్రామంలో మొదలైంది. మొత్తానికి ఎలమంద ఎన్నికల నామినేషన్ వేసేశాడు. సాయంత్రం అందరికీ లెక్కలు క్లియర్ చేసి చూస్తే డ్రాచేయగా బ్యాంకులో డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. తెలిసిన వారి వద్ద చేబదులు తెచ్చి ఆ రోజుకు లెక్క సరిపుచ్చాడు. వైన్స్‌లో అడ్వాన్స్‌గా కట్టిన డబ్బులకు తగ్గట్టుగా మందు ఇచ్చేశామని వైన్స్ ఓనరు చేసిన ఫోన్‌తో ఎలమంద గుండె తొలిసారి ఝల్లుమంది. ఒక్కరోజుకే ఇంత ఖర్చు చేస్తే, మిగిలిన పదిరోజుల ఖర్చు గుర్తుకొచ్చి ఎలమంద మొఖంలో చమట్లు పట్టాయి. బయట యువసేనలు మందుకోసం ఎలమంద జిందాబాద్‌లతో హోరెత్తిస్తుంటే గుండె వేగంగా కొట్టుకోవడం ఎలమంద వంతైంది.