పటాన్చెరు రూరల్, జూలై 5: సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో పరిశ్రమ వర్గాలతో పాటు ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని బీహారుకు చెందిన కరక్కడ్ ఎంపీ రాజారాం సింగ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిన బ్లాక్‌ను శనివారం ఆయన బీహారు సీపీఎం (ఎంఎల్ లిబరేషన్) బృందంతో పాటు పరిశీలించారు. ఈ సందర్భంగా రాజారాం సింగ్ మాట్లాడుతూ.. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో ఇంతమంది పేదలు మరణించడం కలిచివేసిందన్నారు.
దేశంలో జరుగుతున్న వరుస ప్రమాదాల్లో పేద ప్రజలు, కార్మికులు పెద్దఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజీ ధోరణితో కార్పొరేట్ శక్తులకు గుడ్డిగా సహకరిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలోనూ భద్రతా లోపాలు స్పష్టంగా కనబడుతున్నట్లు ఆరోపించారు. సిగాచి పరిశ్రమలో భద్రతా చర్యలు కరువైనట్లు ఆయన ఆరోపించారు. దాదాపు 45 మంది కార్మికులు మృతిచెంది, 40 మంది కార్మికులు తీవ్రంగా గాయపడడానికి, 11మంది గల్లంతు కావడానికి పరిశ్రమలో సేఫ్టీ లోపమే కారణమన్నారు.
పరిశ్రమల యాజమాన్యాలు సరైన సేఫ్టీ పద్ధతులు పాటించక పోవడం, ప్రభుత్వ యంత్రాంగం అవినీతి, తూతూమంత్రపు చర్యలతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతునట్లు ఆరోపించారు. కార్పొరేట్, వ్యాపార వ్యవస్థలు కార్మికుల, సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తులు తయారు చేస్తున్నాయని, నష్టపరిహారం చెల్లింపులో సమగ్ర విధానం అమలు చేయడం లేదని ఆరోపించారు. బాధితు కుటుంబాల్లో ఎవరికి అన్యాయం జరిగినా తాము ఊరుకునేది లేదని, ప్రభుత్వం, పరిశ్రమ ఇచ్చిన హామీ మేరకు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఎంపీ రాజారాం సింగ్ డిమాండ్ చేశారు. అనంతరం హెల్ప్‌డెస్క్ వద్ద బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.