పటాన్చెరు/గుమ్మడిదల, సెప్టెంబర్ 20 : ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన పటాన్చెరులో పరిశ్రమల కాలుష్యంతో ప్రజారోగ్యానికి ముప్పు తప్పడం లేదు. వర్షాలు కురుస్తుండడంతో వర్షపు నీటి మాటున రసాయన పరిశ్రమలు వ్యర్థాలను బయటకు వదులుతున్నాయి. దీంతో ప్రజలు జల కాలుష్యం బారినపడుతున్నారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రసాయన, ఫార్మా, బయోటెక్ యూనిట్లు ఉండడంతో కాలుష్య సమస్య పెరిగిపోయింది. వర్షం కురిసిన ప్రతి సారి పరిశ్రమల నుంచి వ్యర్థ్ధాలు వర్షపు నీటితో కలసి బయటకు వదులుతున్నారు. ఆ కాలుష్య జలాలు చెరువులు, కుంటల్లో చేరుతున్నాయి. వాగులు, కాల్వల్లో చేరి నక్క వాగు ద్వారా మంజీరా నదిలో కలిసిపోతున్నాయి.
దీంతో తాగునీరు కలుషితం అవుతున్నది. తాగునీటితో పాటు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ప్రతిసారి వర్షం పడితే కలుషిత నీరు రంగుమారి బయటకు వస్తున్నది. చెడు వాసన ప్రజలు భరించలేక పోతున్నారు. చర్మవ్యాధులు, శ్వాస సంబంధిత సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్ వంటి సమస్యల బారిన ప్రజలు పడుతున్నారు. రైతులు సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయి. పటాన్చెరు, పాశమైలారం, బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం, గుమ్మడదల, సుల్తాన్పూర్, జిన్నారం, బొంతపల్లితో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు కలుషిత జలాలు బయటకు వదులుతున్నాయి. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పటాన్చెరు ప్రాంతంలో 4వేలకు పైగా పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 2050 రసాయన పరిశ్రమలు ఉన్నాయి.
పరిశ్రమల్లో నిల్వ చేసిన వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకుండా బయటకు పంపుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వర్షపు నీటితో పాటు రసాయన వ్యర్థాలు బయటకు మిక్స్ చేసి పంపిస్తున్నా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు చూసీచూడనట్టుగా వ్యవరిస్తున్నారన్న అపవాదు ఉంది. పరిశ్రమల్లో (ఈటీపీ,సీఈటీపీఎస్) సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా ..అని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే రసాయన వ్యర్థ జలాలను శుద్ధిచేసి, పర్యావరణానికి హాని కలగకుండా సురక్షితంగా విడుదల చేసేందుకు వ్యర్థ జలాల శుద్ధి కేంద్రం పని చేస్తుందా లేదా అని అధికారులు తరుచూ పర్యవేక్షించాలి. వర్షపు నీటితో రసాయన మిశ్రమ జలాలు విడిస్తే వెంటనే పరిశ్రమలపై కేసులు నమోదు చేయాలి. కానీ, అలా జరుగుతలేదని తెలిసింది.
రసాయన పరిశ్రమలు వదులుతున్న కాలుష్య జలాలతో తాగునీటితో పాటు జల,వాయు కాలుష్యం జరగడంతో పాటు వ్యవసాయంపై ప్రభావాన్ని చూపుతున్నది. రసాయన జలాలు చెరువులు, కుంటలు, వాగులు, బావుల్లో చేరడంతో తాగునీటి వనరులు కలుషితం అవుతున్నాయి. ఈ నీరు తాగితే ప్రజలకు చర్మవ్యాధులు, జలుబు, జీర్ణవ్యవస్థ సమస్యలు, కిడ్నీ వ్యాధులు వస్తాయి. చేపలు, జలజీవులు చనిపోతాయి. గాలి పీల్చిన వారికి దగ్గు,శ్వాసకోశ, అస్తమా బారినపడుతున్నారు. క్యాన్సర్ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయన జలాలు పొలాల్లోకి చేరడంతో భూమిలో ఉన్న పోషకాలు నశిస్తాయి.
భూమిలోని సూక్ష్మజీవులు చనిపోవడంతో భూసారం తగ్గి పంటల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల గుమ్మడిదల మండలంలోని పలువురు రైతుల వరిపొలాలను పరిశ్రమల కాలుష్య జలాలు చేరడంతో వారు ఆందోళన చేశారు. రసాయన జలాలతో వ్యవసాయ పంటలపై తీవ్ర ప్రభావం పడుతుంది. వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయల రంగు మారి నష్టం జరుగుతుంది. పంట మొక్కల ఆకులు పసుపు రంగుకు చేరడంతో పాటు పాటు పూత రాలిపోవడం, గింజలు సరిగా కట్టపోవడంతో నష్టం జరుగుతుంది. పంటలు, జీవవైవిధ్యం, ప్రజారోగ్యానికి ముప్పు వాటిళ్లుతున్నది.
గుమ్మడిదల మండలంలోని దోమడుగు నల్లకుంట చెరువులోకి కలుషిత జలాలు వదిలిన సంఘటనపై ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపించింది. శుక్రవారం ప్రభుత్వం నియమించిన కమిటీ నల్లకుంట చెరువును పరిశీలించి, నీటి నమూనాలు సేకరించింది. వర్షం పడిన సమయంలో పరిశ్రమల నుంచి కాలుష్య జలాలు బయటకు వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన పరిశ్రమలపై చర్యలు తీసుకుంటాం.
– కుమార్ పాఠక్, కాలుష్య నియంత్రణ అధికారి
దోమడుగులోని నల్లకుంట చెరువును పరిశీలించాం. ఎయిర్‌ఫోర్స్‌లోని నీటిని, చెరువులోని నీటిని శాంపిల్ సేకరించాం. పరీక్షల అనంతరం బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటాం. కాలుష్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.
– సుమతి, పీసీబీ అధికారి
పటాన్చెరు ప్రాంతంలోని రసాయన పరిశ్రమలు వదులుతున్న కాలుష్య జలాలతో ప్రజారోగ్యం దెబ్బతింటున్నది. పంటలకు నష్టం జరుగుతున్నది. విషపూరిత రసాయనాలు నేరుగా చెరువులు, కుంటలు, వాగుల్లో చేరి తాగునీరు కలుషితం జరుగుతున్నది. పశువులు చనిపోతున్నాయి. పరిశ్రమల్లో ఈటీపీ మురుగునీటి శుద్ధిచేసే ప్లాంట్లు పనిచేస్తున్నాయా లేదా అని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పర్య
వేక్షణ చేయాలి. అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. నీటిలో రంగు, వాసన, నురుగు వంటి
లక్షణాలు ఉంటున్నాయి.
– మాణిక్‌యాదవ్, న్యాయవాది
నల్లకుంట చెరువు కలుషితం కావడానికి పైభాగంలో ఉన్న హెటిరో డ్రగ్స్ పరిశ్రమదే కారణం. ఆ పరిశ్రమ కలుషిత జలాలు వదలడంతో నల్లకుంట కలుషితమై ఎర్రగా మారింది. ఈ పరిశ్రమపై అధికారులు చర్యలు తీసుకోవాలి. పంటలు దెబ్బతిని నష్టపోతున్నాం.
– మద్దిజైపాల్రెడ్డి, రైతు, దోమడుగు