సదాశివపేట, జూన్ 13: అన్నదాత కష్టం అంతా ఇంతాకాదు. ఆరుగాలం కష్టపడి పండిస్తే మిగిలేది అంతంతమాత్రమే. ప్రారంభంలో నకిలీ విత్తనాల బెడద, పంట పెరుగుతున్న క్రమంలో చీడపురుగుల బాధ.. అందులో అకాల వర్షాలు వస్తే అంతే సంగతి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంట వర్షార్పణం. పండిన పంట కాస్త గిట్టుబాటు ధర లేక..దళారుల మోసాలు ఇలా అన్నీ రైతులకు కష్టాలే. దీనికి తోడు ఈ ఏడాది పత్తి విత్తన కంపెనీలు ధరలు పెంచాయి. గతేడాది సాధారణ పత్తి విత్తనాల ప్యాకెట్‌కు రూ. 864 ఉండగా, ఈ ఏడాది అదనంగా రూ.40 నుంచి రూ. 50 దాకా పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. సంగారెడ్డి జిల్లాకు 7,75,078 ప్యాకెట్లు అవసరం ఉండగా, ప్రస్తుతం పెరిగిన ధరతో రూ. 3.87 కోట్లకు పైగా అదనపు భారం రైతులపై పడనున్నది.
సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా పత్తి పంట సాగుచేస్తారు. గతేడాది 3.60లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట పండించారు. ఈ ఏడాది 3,87,539 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందుకు 7,75,078 విత్తనాల ప్యాకెట్లు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఇక సీజన్ ప్రారంభమైందంటే చాలు అనేక కంపెనీల పేర్లతో వందలాది రకాల విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇందులో నకిలీవి ఏవో, అసలివి ఏవో తెలియని పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా మార్కెట్లో బీటీ-1, బీటీ-2 రకాలు అందుబాటులో ఉంటుండగా, రైతులు ఎక్కువగా బీటీ-2 రకాలే కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ ఉన్న విత్తనాలకు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. లేదం టే పత్తి విత్తనాల కో సం వచ్చే రైతులకు ఒకటి, రెండు ప్యాకెట్లకే పరిమితం చేస్తున్నారు. అనేక కంపెనీలు పలు రకాల విత్తనాలను అందుబాటులో ఉంచినప్పటికీ, రైతులు మొగ్గుచూపే బ్రాండ్లకు ధరలు పెంచుతున్నారు.
ఈ ఏడాది సంగారెడ్డి జిల్లాలో 3,87,539 ఎకరాల్లో పత్తి సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకు 7,75,078 విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. సాధారణ పత్తి విత్తనాలకు రూ. 40 నుంచి రూ. 50 దాక ధర పెరగగా (బ్రాండెడ్ పత్తి విత్తనాలకు రూ.100 నుంచి రూ. 200 వరకు) ఈ లెక్కన రూ. 3,87,53,900లకు పైగా భారం రైతులపై పడనున్నది. గతేడాది సాధారణ రకం పత్తి విత్తనాల ప్యాకెట్‌కు రూ. 864 ఉంటే, ఈ ఏడాది రూ. 900 నుంచి 910 వరకు చేరింది.కాలంతో సంబంధం లేకుండా ఏటా పత్తి విత్తనాల కంపెనీలు విత్తన ప్యాకెట్ల ధరలు పెంచుతూ రైతులపై భారాన్ని మోపుతున్నాయి. ఎనిమిదేండ్లుగా కంపెనీలు రైతు నెత్తిన ధరల పేరుతో గుదిబండను ఎత్తుతున్నాయి.
ఒక పత్తి ప్యాకెట్‌పై రూ. 50 ఈ సీజన్లో అదనంగా పెరిగింది. ప్రస్తుత సాగు లెక్కల ప్రకారం ప్రతి ఎకరాకు 2 పత్తి ప్యాకెట్లు అవసరం ఉంటాయి. ఆ లెక్కన 7,75,078 విత్తన ప్యాకెట్లు అవసరం ఉన్నాయి. దీంతో రూ. 3,87,53,900ల ఆర్థిక భారం రైతులపై పడనున్నది. ఇప్పటికే గతేడాది పంటల దిగుబడి సరిగ్గా లేక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. విత్తన ధర పెంపుతో మరింత ఆర్థిక భారం పడిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ సర్కార్‌లో రైతుబంధు పథకం ద్వారా ఏటా రెండు సీజన్లకు ఎకరాకు రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది. పంటల సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందించడంతో రైతులు రంది లేకుండా పంటలు సాగుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెట్టుబడి (రైతు భరోసా) సాయం అందించక పోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.