పటాన్చెరు, ఆగస్టు 8 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు బీఆర్ఎస్ సర్కార్ ఓఆర్ఆర్ నుంచి కొత్తగా రోడ్డు నిర్మాణం చేపట్టింది. కర్ధనూర్ గ్రామ సమీపంలో ఉన్న ఓఆర్ఆర్ నుంచి పాశమైలారం పారిశ్రామిక వాడకు కొత్తగా నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి శంకర్పల్లి వెళ్లే రహదారి నుంచి పారిశ్రామిక వాడకు రోడ్డు నిర్మాణం చేయగా, కర్ధనూర్ శివారులో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద రోడ్డు వెడల్పు పనులు చేస్తున్నారు.
రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడిన సమయంలో రోడ్డు పై వర్షపు నీరు నిల్వ ఉండి వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. రోజూ పారిశ్రామిక వాడకు భారీ వాహనాలు వస్తుండగా, రోడ్డంతా ధ్వంసమై వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయక పోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పుడం లేదు.
పారిశ్రామికవాడ రోడ్డును ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద విస్తరణ పనులు చేపడుతున్నారు. ఈ పనులను కూడా అధికారులు వేగవంతం చేయకపోవడంతో వాహనదారులకు కష్టాలు తప్పుడం లేదు. రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేసి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు.