సంగారెడ్డి, మే 17: రైతులు పంటమార్పిడి పాటించాలని, మామిడి తోటలు, పండ్ల తోటల పెంపకంపై దృష్టిసారించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు. సంగారెడ్డి పట్టణంలోని ఫల పరిశోధన కేంద్రంలో వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం రెండో రోజు మామిడి పండ్ల ప్రదర్శన రైతులు, విద్యార్థులు, అధికారులను విశేషంగా ఆకట్టుకున్నది.
ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా ఉద్యానవన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష హాజరై ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల మామిడి పండ్లను తిలకించారు. ఈ సందర్భంగా యాస్మిన్ భాష మాట్లాడుతూ.. ఉద్యాన పంటల విస్తరణకు రైతులు ముందుకు రావాలని, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పండ్ల తోటల పెంపకంతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల రైతులు ప్రదర్శనకు విచ్చేసి.. అధికారులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించి మెరుగైన దిగుబడులు సాధించాలని కోరారు.
జిల్లాలో 1600 ఎకరాల్లో మామిడి తోటల పెంపకం చేపట్టారని, రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులను అనుసరిస్తూ నాణ్యమైన మామిడి పండ్ల ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతులు చేయాలని పిలుపునిచ్చారు. ఫల పరిశోధన కేంద్రం నుంచి ఏటా రెండు లక్షల నాణ్యమైన మొక్కలు రైతులకు అందజేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రదర్శనలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వర్రావు, డైరెక్టర్ ఆఫ్ ఎక్ట్సెన్షన్ సురేశ్, సీనియర్ సైంటిస్ట్ వెంకటలక్ష్మి, బాబు, కిరణ్‌కుమార్, శాస్త్రవేత్తలు మౌనిక, నవీన్, నితీష్‌కుమార్, ఉద్యాన అధికారులు, డ్రిప్, గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.