సంగారెడ్డి, మార్చి 30: పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డిలోని స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలో సోమవారం సబ్-డివిజనల్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా సంగారెడ్డి ఉప విభాగ పోలీస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు.
ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు, పోలీస్ సేవలు మరింత చేరువ అవుతాయని వివరించారు. పోలీసుశాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని, ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు. డీఎస్పీ సత్తయ్యగౌడ్, డీసీఆర్బీ డీఎస్పీ సురేందర్‌రెడ్డి, ఏఆర్. డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్లు రమేశ్, రామునాయుడు, రామకృష్ణారెడ్డి, కిరణ్‌కుమార్, నాగరాజు, ప్రవీణ్‌రెడ్డి, నాగేశ్వర్రావు, అనిల్, సబ్ డివిజనల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పీఎస్‌లో పరిష్కారం కాని సమస్యలకు జిల్లాస్థాయిలో ప్రజావాణిలో ఫిర్యాదులు అందజేసి సమస్యలు పరిష్కరించుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్పష్టంచేశారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ఆయన స్వయంగా బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు ఫోన్లో ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నామన్నారు.
బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే మార్గాలు సూచిస్తున్నామన్నారు. ప్రజల సమస్యలకు స్థానిక పీఎస్‌లో పరిష్కారం దొరకనపుడు ఎలాంటి భయాలు, ఒత్తిళ్లకు లోనుకాకుండా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ భరోసా కల్పించారు.