అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. సంగారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి రూ. కోట్లు కేటాయించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వైద్యవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం రూ.340 కోట్లతో జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. నర్సింగ్, లా కాలేజీలు మంజూరు చేసి పేదలకు ఉన్నత విద్యను అందిస్తున్నారు. జిల్లా దవాఖానలో పడకల సంఖ్యను 450కి పెంచి కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ. 50 కోట్లు విడుదల చేశారు.
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు 1400 డబుల్బెడ్రూమ్ ఇండ్లు ప్రకటించగా, 925 ఇండ్ల పనులు చివరిదశలో ఉన్నాయి. లాటరీ పద్ధతిలో ఇప్పటికే 425 మందికి ప్రభుత్వం ఇండ్లు కేటాయించింది. మిషన్ భగీరథ ద్వారా 481.53కిలో మీటర్ల దూరం పైపులైన్లు వేసి, 116 ఓహెచ్ఎస్ఆర్లు నిర్మించి, 41,955 నివాసాలకు శుద్ధ తాగునీటిని అందిస్తున్నది. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రూ.739 కోట్లతో 716 కిలోమీటర్ల ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు చేపట్టారు. రైతులకు అన్ని విధాలా అండగా నిలబడాలని 16 రైతువేదికలు నిర్మించి వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో ఆధునిక సాగు పద్ధతులు, పాటించాల్సిన మెళకువలపై అవగాహన కల్పిస్తున్నారు.
Medak2
సంగారెడ్డి, మార్చి 20: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు సమైక్యంగా, సమన్వయంతో పనిచేస్తుండడంతో అభివృద్ధి జోరుగా సాగుతున్నది. పనులు వేగంగా, నాణ్యతగా చేపట్టాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆ దిశగా ముందుకెళ్తున్నారు.
ప్రధానంగా ప్రభుత్వం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టిసారించి అనేక దవాఖానలను 30 పడకల నుంచి 100 పడకలకు పెంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నది. జిల్లాలో వైద్యవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేకుండా సంగారెడ్డిలో మెడికల్ కళాశాల మంజూరు చేసి మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించింది. జిల్లా కేంద్రం దవాఖానలో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన నర్సుల కోసం ప్రత్యేకంగా నర్సింగ్ కళాశాలను కేటాయించగా, ఈ నెల 6న ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు భూమి చేశారు.
గ్రామం నుంచి మండలానికి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రోడ్లను అనుసంధానం చేయడంతో రవాణా సౌకర్యం మెరుగపడి దూరభారం తగ్గింది. ఇందులో భాగంగా రూ.739 కోట్లతో 716 కిలోమీటర్ల మేర జిల్లా ఆర్అండ్బీ రోడ్ల పనులు చేపట్టారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.207.59 కోట్లతో నియోజకవర్గంలో 3,499 కిలోమీటర్ల రోడ్ల పనులు పూర్తిచేశామని అధికారులు తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద రూ.804.89 కోట్లు ఖర్చు చేసి 481.53 కిలోమీటర్లు పైపులైన్లు వేసి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నది.
116 ఓహెచ్ఎస్ఆర్ల నిర్మించి, 41,955 నివాసాలకు తాగునీటిని అందిస్తున్నది. పేదవారి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శ్రీకారం చుట్టింది. నియోజకవర్గంలో 1400 వందల ఇండ్ల నిర్మాణానికి రూ. 58.62 కోట్లు మంజూరు చేయడంతో పనులు చివరి దశకు చేరుకున్నాయి. అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్ నిధులకు కొరతలేకుండా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుండడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
నియోజకవర్గ పరిధిలో పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం 1400 ఇండ్లు మంజూరు చేసింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.58.62 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం 925 ఇండ్ల పనులు చివరి దశకు చేరుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. 475 ఇండ్ల పనులు కొనసాగుతుండగా, లాటరీ విధానంలో 425 మంది లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించారు. మరో 500 ఇండ్లను అన్ని పనులు పూర్తిచేసి అర్హత కలిగిన వారికి అందించేందుకు సిద్దం చేశారు. పనులు కొనసాగుతున్న 425 ఇండ్లను త్వరగా పూర్తి చేసి అర్హులైన వారికి అందజేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
రూ.340 కోట్లతో మెడికల్ కళాశాల…
వైద్యవిద్యను సంగారెడ్డి జిల్లావాసులకు అందించేందుకు జిల్లా కేంద్రం దవాఖానలో రూ.340కోట్లతో మెడికల్, నర్సింగ్ కళాశాలలతో పాటు గిరిజన విద్యార్థులకు లా విద్యను అందించేందుకు దేశంలోనే తొలి గిరిజన లా కళాశాలను మంజూరు చేసి తక్కువ సమయంలో భవన నిర్మాణాలను పూర్తి చేసి తరగతులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మూడు అంతస్తులతో మెడికల్ కాలేజీ భవనం నిర్మించి మొదటి సంవత్సరం విద్యాబోధనకు శ్రీకారం చుట్టింది. నర్సింగ్ విద్యార్థులు విద్యనభ్యసించేందుకు ఈ నెల 6న మంత్రి హరీశ్‌రావు నర్సింగ్ కళాశాలకు భూమిపూజ చేశారు. జిల్లా కేంద్రంలోని దవాఖానలో ఇప్పటికే 450 పడకలతో వివిధ రకాలుగా వైద్య సేవలు ఉచితంగా అందిస్తుండగా, నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు, జోగిపేటలలో 100 పడకల దవాఖానల్లో నిత్యం వందల సంఖ్యలో పేద ప్రజలు చికిత్సలు చేయించుకుంటున్నారు. సదాశివపేట, కోహీర్ 50 పడకలు, కల్హేర్, మిర్జాపూర్ దవాఖానలు 30 పడకలతో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నాయి.
Medak3
సంగారెడ్డి అభివృద్ధికి రూ. 50 కోట్లు..
జిల్లా కేంద్రం సంగారెడ్డి మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధిలో ఆదర్శంగా ఉండాలని గత సంవత్సరం ఫిబ్రవరిలో నారాయణఖేడ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలకు రూ.50 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేశారు. పట్టణవాసులతో పాటు సమీప గ్రామీణప్రాంతాల ప్రజల సౌకర్యార్థం సమీకృత మార్కెట్ నిర్మాణానికి రూ. 20కోట్లు విడుదల చేయడంతో పనులు పిల్లర్ల స్థాయిలో జరుగుతున్నాయి.
సదాశివపేటతో పాటు మిగతా 6 మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ నిధులతో వార్డుల వారీగా ప్రజాప్రతినిధులు, అధికారులు
అత్యవసర పనులు ప్రారంభించి నిర్మాణాలు పూర్తి చేశారు. వీటితో పాటు గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.20లక్షలు మంజూరు చేయడంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి.
రైతుల కోసం రైతు వేదికలు
నాలుగు మండలాలు, పట్టణాలలో అన్నదాతలకు ప్రభుత్వం అందించే పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు తెలిపేందుకు ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించింది. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండడంతో పాటు పంటల సాగులో మెళకువలు ఇచ్చేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నియోజకవర్గం పరిధిలో 16 రైతు వేదికలు నిర్మించి, ప్రతి మంగళ, శుక్ర వారాల్లో పంటల సాగు, దిగుబడులపై రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వివరిస్తున్నారు. డివిజన్, జిల్లా స్థాయి అధికారులు సమావేశాలు నిర్వహించి నూతన పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే దిగుబడులకు లోటు ఉండదని సూచిస్తున్నారు. ముఖ్యంగా అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలతో పంటలు సాగు చేసుకోవాలని అధికారులు రైతులను చైతన్యం చేస్తున్నారు. వీటితో పాటు గ్రామాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామానికో క్రీడాప్రాంగణం నిర్మిస్తున్నది. గ్రామాలన్నీ పచ్చటి వాతావరణం సంతరించుకునేలా ప్రకృతి వనాల ఏర్పాటుకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి అభివృద్ధికి బాటలు వేసింది.
అభివృద్ధిలో ఆదర్శంగా నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఆదర్శంగా నిలవడం సంతోషకరం. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాం. అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఎంతో సహకరిస్తూ నిధులు మంజూరు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపిస్తుండడంతో ప్రజలు బీఆర్ఎస్కు మద్దతుగా నిలబడుతున్నారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుండడంతో పార్టీపై నమ్మకం పెరుగుతున్నది. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ అందంగా తీర్చిదిద్దుతున్నాం.
– చింతా ప్రభాకర్, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, సంగారెడ్డి