సంగారెడ్డి, జనవరి 28: ఉద్యోగాలు సాధించాలంటే పైరవీలు అవసరం లేదని, పట్టుదలతో శ్రమించి చదివితే విజయం ఖాయమని, ఈ విషయాన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు గుర్తిస్తే ఉద్యోగం మీముందర ఉంటుందని గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల అవగాహన సదస్సును శనివారం పట్టణంలోని జిల్లా గ్రంథాలయ అడిటోరియంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథులుగా రాష్ట్ర గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థల అధ్యక్షుడు అయాచితం శ్రీధర్‌తో పాటు గ్రూప్-1అధికారులు, వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్నదని, చదువుకున్న నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. సీఎం కేసీఆర్ 90వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసి ఉద్యోగాలు కల్పించేందుకు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. గ్రూప్-1, 2, 3, 4లకు నోటిఫికేషన్లతో పాటు పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్ఐ తదితర పోస్టుల భర్తీ కొనసాగుతున్నదన్నారు. కొత్తగా జోనల్ విధానంతో స్థానికులకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో సీఎం జోనల్ విధానాన్ని తీసుకువచ్చారన్నారు. దీంతో జిల్లావాసులకే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతాయన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో చదివితే ఉద్యోగం ఖాయమని సూచించారు. అభ్యర్థులు గతంలో గ్రూప్-1లో ర్యాంకు సాధించి ఉద్యోగాలు చేస్తున్న అధికారులు సూచనలు, సలహాలు పాటించి ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.
గ్రంథాలయాల్లో పుస్తకాల కొరతలేదు..
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న గ్రంథాలయాలతో సహా గతంలో కొనసాగుతున్న గ్రంథాలయాల్లో పుస్తకాల కొరతలేదని, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కావలసిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వం గ్రంథాలయాలను బలోపేతం చేసేందుకు అన్ని విధాలా చర్యలు చేపడుతుందని, పోటీ పరీక్షల అభ్యర్థులు చదువుకునేందుకు వీలుగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ముఖ్యంగా అభ్యర్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు గ్రూప్-1 విజయం సాధించి ఉద్యోగాలు చేస్తున్న అధికారులతో శిక్షణ ఇప్పించడం జిల్లా గ్రంథాలయ సంస్థ తీసుకున్న చర్యలు భేష్ అని ప్రశంసించారు. ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం సాధిస్తారన్నారు. ఈ సదస్సులో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మాకం విఠల్, కార్యదర్శి వసుంధర, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్, ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ శివలింగయ్య, పౌరసరఫరాల జీఎం కాకర్ల శ్రీనివాస్, వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ రాధాకృష్ణ, ఆడిట్ డిప్యూటీ డైరెక్టర్ నూతన కంటి వెంకట్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రజినీకాంత్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మధుబాబు, ఎక్సైజ్ ఎస్ఐలు వెంకటేశ్వర్‌రెడ్డి, శిరీష, డిప్యూటీ తహసీల్దార్ (గ్రూప్-2 రాష్ట్ర మొదటి ర్యాంకు) నరేశ్, నిపుణులు సుంకర రమాదేవి, సోషల్ వెల్ఫేర్ అధికారి శంకర్, బీసీ వెల్ఫేర్ అధికారి రాములు తదితరులు పాల్గొన్నారు.
– రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్