దుబ్బాక, జూన్ 23 : దుబ్బాక పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో సమస్యగా మారింది. దుబ్బాక పట్టణంలోని బస్టాండ్ నుంచి పాత సీనిమా రోడ్డులో మురుగు కాల్వలు శుభ్రం చేయక చెత్తాచెదారం పేరుకుపోయింది. కాల్వలు ప్ల్లాస్టిక్ బాటిల్స్, కవర్స్‌తో నిండి దుర్గంధం వెదజల్లుతోంది. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానిక వ్యాపారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాకలో పలు వార్డుల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ఇబ్బందికరంగా మారాయి. పిచ్చి మొక్కల మధ్య పాములు, ఇతర విషకీటకాలు సంచరిస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డుల్లో చెత్త సేకరణకు మున్సిపల్ వాహనాలు నిత్యం రాక ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. దుబ్బాక పట్టణంలో సేకరించిన చెత్తను మున్సిపల్ సిబ్బంది డంపింగ్‌యార్డుకు తరలించకుండా పట్టణ శివారులోని రోడ్ల పక్కన పారేస్తున్నట్లు విమర్శలు నెలకొన్నాయి. చెత్తకుప్పల వద్ద కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దుబ్బాక పట్టణంలో దుబ్బాక-చీకోడు రోడ్డులో చెత్త కుప్పలు ఏర్పాటు చేయడంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలో ఎల్లమ్మ దేవాలయం, బీరప్ప దేవాలయాలు ఉండటంతో ఆలయాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
దుబ్బాక పట్టణంలో పలు వార్డుల్లో నాటిన హరితహారం మొక్కలు నేల పాలవుతున్నా యి. మొక్కల సంరక్షణ లేక చాలా చోట్ల ఎండిపోయాయి. మరికొన్ని చోట్ల మొక్కలకు నాటిన కంచెలు నేలకొరిగి విరిగిపోయాయి. మొక్కలు నాటి వాటి సంరక్షణ గాలికొదిలేశారు. దుబ్బాక-చీకోడు రోడ్డు, దుబ్బాక-దుంపలిపల్లిలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కలు నాటడంపై ఉన్న శ్రద్ధ వాటి సంరక్షణ లేక హరితహారం లక్ష్యం నీరుగారిపోతోంది.
దుబ్బాక పట్టణంలో పారిశుధ్యం మెరుగు పర్చేందుకు త్వరలోనే స్పెషల్ డ్రైవ్ చేపడుతాం. ఒక్కొక్క వార్డులో మున్సిపల్ సిబ్బందితో ప్రత్యేకంగా పారిశుధ్య పనులు చేపట్టి సమస్య పరిష్కరిస్తాం. సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. హరితహారం లో నాటిన మొక్కల సంరక్షణ కోసం సిబ్బందిని ఏర్పాటు చేసి, వాటిని కాపాడుతాం. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు తీసుకుంటాం.