జిన్నారం, మే 4: ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తూ అక్రమారులు వెంచర్ల పేరిట ప్లాట్లు విక్రయిస్తున్నారని ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి ఆరోపించారు. బొల్లారం మున్సిపాలిటీలోని సర్వేనెంబర్ 172లో 22.20 ఎకరాలకు సంబంధించి 17.20 ఎకరాల సీలింగ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు గుంటల రూపంలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ అమాయకులకు ప్లాట్లు విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ స్థలంలో రియల్ వ్యాపారులు గుట్టలు, గుంతలను చదువును చేసి అనుమతులకు విరుద్ధంగా రెవెన్యూ అధికారుల అండదండలతో 419 ప్లాట్లను అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆయా శాఖల అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు. ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
గతంలో ఫిర్యాదు చేస్తే మున్సిపల్ అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నారని, ప్రభుత్వ భూమి కబ్జాకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అటు రెవెన్యూ, ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులపై ఉందన్నారు. లేనిపక్షంలో ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ప్రభుత్వ భూమిని కాపాడతామని ఆయన పేర్కొన్నారు..