ఆమీన్పూర్, సెప్టెంబర్ 23: హైడ్రా తరహాలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని టైలర్ వెనుక భాగంలో వైకుంఠధామం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో (సర్వే నంబర్ 993లో) అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను మున్సిపల్ టీపీవో పవన్,ఆర్ఐ రఘనాథరెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేశారు.
ఇకపై ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా నిర్మాణాలు చేపడితే సహించేది లేదని, వెంటనే అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో పాటు చట్టపరమైన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు. ఒకవైపు హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతుండగానే కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపట్టడం సరైన చర్య కాదని, అటువంటి ఆలోచనలు మానుకోవాలని సూ చించారు. ఈ కూల్చివేతలో రెవెన్యూ, మునిసపల్ సిబ్బంది పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ పరిధిలో హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేసిన భవనాలకు ముందస్తుగానే నోటీసులు ఇచ్చినట్లు అమీన్పూర్ తహసీల్దార్ రాధ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ స్థలంలో కబ్జాదారులు అక్రమంగా నిర్మిస్తుంటే రెవెన్యూ నిబంధనల ప్రకారమే నోటీసులు అందజేస్తూ వారికి తెలియజేశామన్నారు. అయినప్పటికీ సదరు వ్యక్తు లు అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. చివరగా కూల్చివేతలకు ముందుగానే వారికి నోటీసులు అందజేసినట్లు తెలిపారు. ఎక్కడ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టలేదన్నారు.