పచ్చనిచెట్లతో ఆహ్ల్లాదకరంగా ఉండాల్సిన గుట్టలను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. గుట్టల నుంచి రాత్రి పూట మట్టి తవ్వకాలు చేపడతున్నారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. రోజులుకాదు, నెలలు కాదు ఏండ్ల తరబడి మట్టితవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు.
నర్సాపూర్, ఆగస్టు 16: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలోని డంపింగ్యార్డు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలోని కోడిగుట్టను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. రాత్రి 10గంటలు దాటిన తర్వాత అక్రమంగా జేసీబీలతో తవ్వకాలు చేపట్టి టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా 20 నుంచి 300 అడుగుల లోతువరకు తవ్వకాలు చేపడుతున్నారు.
నిబంధనల ప్రకారం చెరువులు, గుట్టలు, కుంటల నుంచి మట్టి తరలించాలంటే ఇరిగేషన్, అటవీ, రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతులు తప్పకుండా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే రాత్రి సమయంలో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. ముఖ్యంగా సెలవు రోజులు వచ్చాయంటే చాలు అక్రమార్కులకు పండుగే. అడ్డూఅదుపులేకుండా తవ్వకాలు చేపట్టి పెద్దఎత్తున మట్టిని తరలిస్తున్నారు.
అక్రమ తవ్వకాలు జరిగినప్పుడు మందుకొచ్చి కొందరు అధికారులకు ఫిర్యాదు చేస్తే నామమాత్రపు తనిఖీలు చేపట్టి కొద్దిపాటి జరిమానాలు విధిస్తున్నారు. దీంతో అక్రమార్కులు యథావిధిగా తవ్వకాలు చేపడుతున్నారు. నర్సాపూర్ పరిసర ప్రాంతంలో సహజసిద్ధంగా రోడ్డుకు ఆనుకొని ఉన్న కొండలు, గుట్టలు రోజురోజుకూ కనుమరుగవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గుట్టనుంచి అక్రమ తవ్వకాలు చేపట్టకుండా ఉండేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన స్టేంచిని తొలిగించి మట్టితవ్వకాలు చేపట్టారు. ఈ విషయం అటవీశాఖ అధికారులకు తెలియడంతో నాలుగు రోజుల కింద తిరిగి గుట్టలోకి పోకుండా కందకం ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, అటవీశాఖ అధికారులు స్పందించి ప్రకృతి సంపదను పరిరక్షించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
కొండ నుంచి స్టేంచిని తొలిగించి అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపినట్లు మా దృష్టికి వస్తే గుర్తించి పెద్దఎత్తున జరిమానా విధించాం. స్టేంచిని యథావిధిగా మూసివేశాం. అక్రమ తవ్వకాలు జరిపినట్లు ఫిర్యాదు చేస్తే వాహనాలను సీజ్ చేస్తాం.
– దివ్య, అటవీ శాఖ అధికారి, నర్సాపూర్ (మెదక్ జిల్లా)