సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 27 : ‘మంత్రిపదవి కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలువలేదని.. మునుగోడు అభివృద్ధి కోసమే కలుస్తున్నానని, మంత్రి పదవి ఇవ్వడం సీఎం చేతిలో లేదని.. తనకు మంత్రి ఇవ్వాలో వద్దో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలకేంద్రంలోని రజక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకర్గంలో సాగునీటి సమస్య ప్రధానంగా ఉన్నందున డిండి ప్రాజెక్టు ద్వారా నీరు అందించే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితో పలుమార్లు మాట్లాడినట్టు తెలిపారు. నకిరేకల్ సభలో కూడా సీఎంతో ఇదే అంశంపై మాట్లాడి హామీ తీసుకున్న తర్వాతే శాలువా కప్పానని చెప్పారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పినా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ పోటీ చేశానని వివరించారు.