హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రముఖ రచయిత, అధ్యాపకుడు శ్రీ శ్రీ కుమార్ (శ్రీరామ కవచం శ్రీనివాస కుమార్) (63) ఆదివారం ఉదయం అత్తాపూర్‌లోని జనప్రియలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తెలంగాణలోని సోషల్ వెల్పేర్ డిపార్ట్మెంట్లో బోధకుడిగా తన ప్రస్తానాన్ని ప్రారంభించిన ఆయన.. ఎస్టీ వెల్ఫేర్ శాఖలో ఓఎస్డీగా నాటి అధికారి ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌తో కలిసి వెనుకబడిన తరగతుల విద్యారంగానికి విశేష సేవలందించారు.ముఖ్యంగా ఆంగ్ల భాషా అనువాదకుడిగా ఆయన మంచి గుర్తింపు పొందారు. సామాజిక సమస్యల పట్ల నిరంతరం స్పందిస్తూ విలక్షణమైన శైలితో సాహితీ లోకంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
సమాజ హిత రచయిత శ్రీ శ్రీ కుమార్ : జూలూరు గౌరీశంకర్
తన కోసం కాకుండా సమాజ హితం, సామాజిక మార్పు కోసం రచనలు చేసిన ప్రముఖ రచయిత, అధ్యాపకుడు శ్రీ శ్రీ కుమార్ అకాల మరణం సమాజానికి, సాహిత్య రంగానికి తీరని లోటని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అదివారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన ఇంటి పేరులోని ‘కవచాన్ని సమాజానికి అక్షర కవచం’గా మలిచి రచనలు చేసిన ఆయన.. తెలంగాణ అస్తిత్వానికి అసలైన రక్షణ కవచమని కొనియాడారు.
అధ్యాపక వృత్తిలో నిబద్ధతతో పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం విద్యారంగ సమస్యలు, తెలంగాణ అస్తిత్వంపై చేసే దాడులపై అనేక వ్యాసాలు రాశారని గుర్తుచేశారు. ఇటీవల 250 పేజీల ‘జూలూరు పదం‘ దీర్ఘ కవితను ఆంగ్లంలోకి అనువదించే బృహత్తర బాధ్యతను చేపట్టి, సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి ఆంగ్ల సాహిత్య వేదికపై అద్భుతమైన అనువాదకుడిగా పరిచయం కావాల్సిన తరుణంలోనే ఆయన అస్తమించడం అత్యంత బాధాకరమని తెలిపారు. సీనియర్ జర్నలిస్టులు గంధం బంగారు, పసుపులేటి విద్యాసాగర్, రావెళ్ల విశ్వనాథం, గిరిజన సంక్షేమ సంఘ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సీతా మనోహర్, రమేశ్, చక్రవర్తి, అజీజ్, రమేశ్‌రెడ్డి, యాదగిరి, ఎండీ ఖాసీం, గురుకుల సిబ్బంది శ్రీశ్రీ కుమార్‌కు నివాళులర్పించారు.