మిరుదొడ్డి, జనవరి 13 : పట్టా భూమిలో అనుమతి లేకుండా అక్రమంగా రోడ్డు వేసిన కాంగ్రెస్ నాయకులపై అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాజీ వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు డిమాండు చేశారు. అల్వాల గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ రాజులుకు చెందిన 76, 77 సర్వే నెంబర్లలో 3 ఎకరాల పట్టా భూమి ఉండగా అందులో ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు మట్టి రోడ్డు వేశారు. సోమవారం వైస్ ఎంపీపీ గ్రామస్తులతో కలిసి రోడ్డును పరిశీలించి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన సత్యనారాయణ రెడ్డి, కనకయ్య కలిసి మట్టి రోడ్డు వేశారని ఆరోపించారు. తనను సంప్రదించకుండా అధికార పార్టీకి చెందిన వ్యక్తులు బరితెగించి దుశ్చర్యలకు పాల్పడడం సిగ్గు చేటని మండిపడ్డారు. అక్రమంగా రోడ్డు వేసిన కాంగ్రెస్ నాయకులపై కలెక్టర్, సీపీ, దుబ్బాక సీఐ, మిరుదొడ్డి తహసీల్దార్, మిరుదొడ్డి ఎస్సైలకు ఫిర్యాదు చేశానని రాజులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తుమ్మల బాల్రాజు, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ అహ్మద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.